25, సెప్టెంబర్ 2016, ఆదివారం

మళ్ళీ మళ్ళీ అవాక్కయ్యారు.

అది ఓ పెద్ద స్కూల్ ఆడిటోరియం. అసెంబ్లీ జరుగుతోంది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ, పిల్లలనుద్దేశించి ఏదో ప్రశ్న అడిగాడు. జవాబు తెలిసినవాళ్ళను చేతులెత్తమన్నాడు.  కొంతమంది పిల్లలు చేతులెత్తారు. వాళ్ళలో  ఓ ఎనిమిదేళ్ళ బుజ్జిబాబు కూడా ఉన్నాడు. ప్రిన్సిపల్ ఆ అబ్బాయి ని స్టేజి మీదకు వచ్చి చెప్పమన్నట్టు సైగ చేశాడు. ఆ బుజ్జిబాబు ఉత్సాహంతో పరుగెత్తుతూ స్టేజి మీదకు వెళ్ళాడు. మైక్ చేతిలోకి తీసుకున్నాడు. జవాబు చెప్పడానికి నోరు తెరిచాడు.  కానీ చెప్పలేకపోతున్నాడు. తెలీక కాదు. స్టేజి ఫియర్ అంతకన్నా కాదు. కానీ నోట్లోంచి ఎందుకో మాట పెగల్లేదు. ఏదో అదృశ్య శక్తి గొంతు నొక్కేస్తున్నట్టు,  ఏవో శబ్దాలు వస్తున్నాయి కానీ చెప్పాలనుకున్న మాట నోట్లోంచి బైటకు రావట్లేదు.


ఆడిటోరియం అంతా సైలెంట్ అయిపోయింది. ఎక్కడో ఎవరో కిసుక్కుమని నవ్విన నవ్వు వినిపించింది.  వెంటనే ఇంకొన్ని, మరికొన్ని నవ్వులు వినిపించాయి. ప్రిన్సిపల్ తేరుకున్నాడు. ఆ చిన్నపిల్లాడి మనసు నొచ్చుకుందేమో అని కంగారు పడ్డాడు. మైక్ చేతిలోకి తీసుకున్నాడు. అలా నవ్వడం తప్పు అని, అలా speech impediment గానీ ఇంకేదైనా impediment ఉన్నవాళ్ళను చూసి నవ్వకూడదని బుద్ధి చెప్తున్నాడు. ఇంతలో మైక్ పట్టుకున్న బుజ్జిబాబు గట్టిగా నవ్వాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆ బాబు వంక చూశాడు. "నువ్వెందుకు నవ్వావ్?" అని అడిగాడు. "Because they think they are all perfect." బుజ్జిబాబు చెప్పాడు.
 ఇప్పుడు గొంతు పెగలకపోవడం, నోట  మాట రాకపోవడం, అవాక్కవడం అందరి వంతయింది.


బుజ్జిబాబుకు చిన్నప్పటినుంచీ పుస్తకాలు బాగా  చదవడం అలవాటు. ఇదీ అదీ అని కాదు. కనిపించిన ప్రతీ పుస్తకం చదివేసేవాడు. ఓసారి ప్రొద్దున్నే బుజ్జిబాబు స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ  ప్రక్కనున్న
ఇంకో అబ్బాయి తో ఏదో చెప్తున్నాడు. ఆ అబ్బాయికి వినడానికి ఇష్టం లేనట్లుంది. కష్టంగా ఉన్నట్టుంది.
దిక్కులు చూస్తూ తప్పించుకోవడానికి చూస్తున్నాడు.  పక్కకు తిరిగి నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అది చూసిన అమ్మ మనసు చివుక్కుమంది. "ఎందుకు కన్నా! నీకు తెలిసిన ప్రతీ విషయం  ఎవరో ఒకరికి చెప్పాలనుకుంటావ్?  నీకు నువ్వుగా నవ్వులపాలవుతావ్? ఊరుకున్నంత ఉత్తమం ...." అంటూ ఏదో చెప్తోంది. ఆ బుజ్జిబాబు అమ్మ పక్క ఓసారి చూసి ఇలా అన్నాడు.

There are two kinds of people in the world.
Those, who would want to listen to me and those who wouldn't want to listen to me.
Those who would want to listen to me,  would listen to me no matter how I say.  
And similarly those who wouldn't want to listen to me, won't listen to me no matter what I say. 

ఈ సారి గొంతు పెగలకపోవడం,  నోట మాట రాకపోవడం,  అవాక్కవడం అమ్మ వంతయింది.


బుజ్జిబాబుకు హైస్కూల్ లో చేరే వయసు వచ్చింది. అమ్మ నాన్నతో ఇంకో దేశం వెళ్ళాడు. వాళ్ళు
వెళ్ళేటప్పటికే ఆ దేశంలో academically advanced and talented schools లో అడ్మిషన్ process అంతా అయిపోయింది. బుజ్జిబాబు కు ఓ IQ test లాంటిది పెట్టి, దాని ఆధారంగా అడ్మిషన్ ఇచ్చే వీలుంటే చూస్తానంది ఆ హైస్కూల్ ప్రిన్సిపల్.  మర్రోజు పొద్దున్నే టెస్ట్ అంది. రెండు వారాల తర్వాత, "రిజల్ట్ డిస్కస్ చేయాలి. రమ్మని" ఫోన్ కాల్ వచ్చింది.  హైస్కూల్ ప్రిన్సిపల్, కౌన్సెలర్, అమ్మ, నాన్న కూర్చున్నారు. బుజ్జిబాబు రాసిన  IQ test పేపర్ ను చూపిస్తూ అందులో ఓ ప్రశ్నను చదివింది ప్రిన్సిపల్.

How would you relate jealousy and happiness?
"ఇలాంటి  ప్రశ్నలుంటాయా? ఇంక వాడేం రాసి ఉంటాడు?" అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు.
"మీరైతే ఏం రాస్తారు?" అడిగింది  ప్రిన్సిపల్. అమ్మ నాన్న ఇద్దరూ తడబడ్డారు.
"మీ వాడేం రాశాడో చూడండి." చెప్పింది  ప్రిన్సిపల్.

Jealousy and happiness are human emotions. 
They exist on the opposite  ends of human emotional spectrum.
If you have one, you will not have the other.

అంత చిన్న మాటల్లోఓ జీవిత సత్యం తెలుసుకున్న ఆనందంతో, కళ్ళు చెమ్మగిల్లాయి.

నోట మాట రాలేదు.  గొంతు పెగల లేదు.  అవాక్కవడం ఆ నలుగురి వంతయింది.


బుజ్జిబాబు  హైస్కూల్ లో చేరాడు. స్కూల్ డిబేటింగ్ టీమ్ లో ముఖ్య సభ్యుడయ్యాడు. క్విజ్  టీం లీడరయ్యాడు. ఆర్ట్స్ అండ్ కల్చరల్   యూనిట్ లో అంతా తానే అయ్యాడు. స్కిట్స్ రాశాడు. డైరెక్ట్ చేశాడు. యాక్ట్ చేశాడు. ఫోటోగ్రాఫరయ్యాడు. వీడియోలు తీశాడు.  ఓల్డేజ్ హోమ్ లలో వాలంటీర్ గా చేశాడు. సాకర్ ఆడతాడు.  స్విమ్మింగ్ చేస్తాడు. కీ బోర్డ్, తబలా వాయిస్తాడు. ఇండియా లో లేడన్నమాటే గానీ ఇండియా అంటే ప్రాణం పెడతాడు.  ఇండియా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. మహాభారతం,రామాయణం చదివాడు. అలా అని చదువును నిర్లక్ష్యం చేయలేదు.  ఎప్పుడూ టాపరే. 
టీచర్లకూ, తోటి పిల్లలకు  తలలో నాలుకయ్యాడు.  కానీ   నవ్విన వాళ్ళందరూ అవాక్కయ్యారు. 



ఇప్పుడు బుజ్జిబాబు 11th లో ఉన్నాడు. 2017 కు గాను  school captain గా elections లో contest చేశాడు. పోటీ చేస్తున్నట్టు  అమ్మ నాన్న లతో ముందుగా చెప్పలేదు. Contestants అందరూ whole school కు ఆడిటోరియం లో canvassing speech ఇవ్వాలి. ముందు కొద్దిగా తడబడ్డాడు.  వెంటనే  సంభాళించుకున్నాడు. Speech ఇచ్చేశాడు.
Audience లో ఉన్న ఓ తుంటరి, "You are an Indian, not an Australian. How would you relate to,
understand and solve our issues?"  అన్నాడు.
వెంటనే బుజ్జిబాబు,  " I am like this school blazer,  20% cotton,  80% polyester. 
Made in China. But proudly bearing the school emblem." అన్నాడు.
ఆగకుండా రెండు నిముషాలపాటు ఆడిటోరియం లో చప్పట్లు మోగిపోయాయి.
అల్లరి  పెట్టాలనుకున్న తుంటరి గొంతు పెగల్లేదు. నోట  మాట రాలేదు. అవాక్కయ్యాడు.



నిన్న శుక్రవారం అసెంబ్లీ లో elections results announce చేశారు. బుజ్జిబాబు school captain for the year 2017 గా huge margin తో గెలిచాడు. మళ్ళీ ఆడిటోరియం లో చప్పట్లు ఆగకుండా మోగాయి.
ఈ సారి కూడా అమ్మ నాన్నలకు  గొంతు పెగల్లేదు. నోట్లో మాట రాలేదు. 
గుండెలనిండా గర్వంతో, పట్టలేని ఆనందంతో అవాక్కయ్యారు.



26, ఆగస్టు 2016, శుక్రవారం

ఓ వెరైటీ కాఫీ కధ.


అవి నా పదవతరగతి వేసవి శెలవులు. పరీక్షలు బాగా వ్రాశానన్న  సంతోషం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చానన్న ఆనందం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.  అప్పటికే ఏ కాలేజ్ కు అప్లై చేయాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి లాంటి విషయాలలో నాకు ఫుల్ క్లారిటీ ఉండటంతో, చదువు, ఇంకా కాలేజ్ కు సంబంధించి ఎటువంటి కన్‌ఫ్యూషన్ లేదు. కానీ మొదటిసారిగా  ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉండబోతున్నానన్న ఆలోచనతో, అదేదో తెలియని దిగులు మనసంతా నిండిపోయింది. అయినా ఎప్పటిలా కజిన్స్ తో  హ్యాపీ గా శెలవులు గడిపేస్తున్నాను.


ఇంతలో ఎవరిదో దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళి శుభలేఖ అందింది. బాగా కావలసిన వాళ్ళు. అందరూ వెళ్ళాలని అనుకున్నా, మా అమ్మమ్మ వయసు, ఎండలు, దూరప్రయాణం, ఆరోగ్యం ఇలా అనేక కారణాల వల్ల ఆమె వెళ్ళలేని పరిస్ధితి.  ఆమెతో ఎవరో ఒకరు ఉండాల్సి వచ్చింది. నా అంతట నేనే అమ్మమ్మతో ఉంటానని అన్నానో, లేకపోతే నన్ను 'ఉంటావా?' అని అడిగారో సరిగ్గా గుర్తు లేదు కానీ, పెళ్లికి అందరూ వెళ్ళిపోయారు. నేను అమ్మమ్మతో ఉండిపోయాను. ఆ రోజుకు వంట చేసిపెట్టేసి వెళ్ళడంతో మేము వంటింటి లోకి వెళ్ళే అవసరం రాలేదు.


మర్రోజు మామూలు గానే తెల్లవారింది. మా ఆస్ధాన పనిమనిషి అక్కమ్మ,  రోజులాగే  'నెమ్మదిగా'  పని చేస్తోంది.  ఈ అక్కమ్మ మాటలే కాదు, పని కూడా మహా నెమ్మది.  నాకు ఊహ తెలిసినప్పటినుండి వేసవి శెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా, ఈ అక్కమ్మే పని చేస్తూ ఉండేది. పని ఎక్కువగా ఉంటుందని మేమందరం వెళ్ళినప్పుడు మాత్రం అక్కమ్మకు తోడుగా అక్కమ్మ కూతురు గానీ  కోడలు గానీ పనికి వచ్చేవాళ్ళు.  ఈ అక్కమ్మ చాలా అమాయకురాలు. ఆ పల్లెటూరు దాటి కనీసం పక్కనున్న టౌన్ కూడా చూసిన మనిషి కాదు.  నా మావయ్యల్లో ఒకరు గుజరాత్ లో, ఇంకొకరు కర్ణాటక లో, ఇంకొకరు మహారాష్ట్రలో ఉండేవాళ్ళు. ఆ అక్కమ్మకు మా పిల్లగ్యాంగ్ ఏం మాట్లాడుకుంటున్నా, ఆడుకొంటున్నా, అసలేం చేస్తున్నా ఎందుకో భలే ఆశ్చర్యంగా ఉండేది. చేతిలో పని ఆపేసి, అలా చూస్తూ నిలబడి ఉండిపోయేది. ఇంకంతే! ఎక్కడి పని అక్కడే నిలిచిపోయేది. అసలే పని నెమ్మది. దానికి తోడు ఎక్కడిక్కడ అలా నిలబడి పోతూ ఉండటంతో, పని ఎంతకూ తెమిలేది కాదు.


మళ్ళీ అసలు కధ లోకెళ్తే,  నాకు నిద్ర లేచాక కాఫీ వేడివేడి గా తాగే అలవాటు ఉండటంతో, వెళ్ళి అమ్మమ్మను కాఫీ చేసిమ్మని అడిగాను.  'స్టౌ వెలిగించి పాలు పెట్టు. నేను వస్తున్నాను'  అంది అమ్మమ్మ.
ఎన్నడూ స్టౌ వెలిగించడం అటుంచి, వంటింటిలోకి కూడా వెళ్ళి ఉండకపోవడంతో, నేను వంటింటిలోకి
వెళ్ళి స్టౌ ముందు నించుని, కొంచెం వంగి ఎలా వెలిగించాలో ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని
చూస్తున్నా. ఇంతలో అమ్మమ్మ వచ్చి "ఏంటి అలా వంగి చూస్తున్నావు? గ్యాసు వాసన ఏమైనా వస్తోందా"
అని గొంతులో, చూపులో ఆందోళన నింపుకొని అడిగింది.  ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో తెలీక, తల అన్ని
రకాలుగా ఊపేశాను. "ముందు బయటకు వెళ్ళిపోదాం పద" అని కంగారు  కంగారుగా అనడంతో ఇద్దరం
గబగబా వంటింటి లోంచి బయటకు వచ్చేశాం.


కొద్దిసేపయిన తర్వాత  " అసలు నాకేమీ గ్యాస్ వాసన రావట్లేదు. గ్యాసు వాసన ఏమైనా తగ్గిందేమో చూద్దాం పద." అని అమ్మమ్మ అనడంతో  "నేను చూసొస్తానుండు" అని  మళ్ళీ వంటింటిలోకి వెళ్ళి స్టౌ వెలిగించడానికి  క్లూ  ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను. ఇంతలో వెనకనుంచీ అమ్మమ్మ,
"నాకేమీ గ్యాస్ వాసన రావట్లేదు. నీకెక్కడ నుంచీ వస్తోంది? ఇంతకీ అసలు స్టౌ ను ఎందుకలా
చూస్తున్నావని" అడిగింది.  ఏం చెప్పాలో తెలీలేదు. అంత  వరకు ఎప్పుడూ అమ్మమ్మ దగ్గర గారాలు
పోవడమే కానీ, ఎప్పుడూ భయపడి ఎరుగను. నా మొహం చూడగానే నాకు స్టౌ వెలిగించడం రాని
విషయం తెలిసిపోయినట్టుంది. కానీ పాపం! నన్నేమీ అనలేదు. "ఇదిగో! ఇలా వెలిగించాలి." అని చూపించింది. పాలు కాచి,  కాఫీ పెడుతుంటే,   వెనకాలే నించుని  చూస్తుంటే," ఓస్! ఇంతేనా కాఫీ
పెట్టడం అంటే" అని అనిపించింది.


ఇద్దరం కాఫీ తెచ్చుకుని తాగేశాక మళ్ళీ అమ్మమ్మ,  "అక్కమ్మకు కాఫీ పెట్టివ్వాల"ని  లేవబోయింది.
నేనుఎలాగైనా అమ్మమ్మను ఇంప్ప్రెస్   చెయ్యాలని వెంటనే లేచి , "నువ్వుండు. నేను పెట్టిస్తా! ఇప్పుడేకదా
 చూపించావు.  చాలా ఈజీ!" అని అభయమిచ్చి వంటింటిలోకి వెళ్తున్నాను. వెనకాల నుంచి, "నిన్నటి
పాలు కొన్ని చిన్న గిన్నెలో  ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. వాటితో  అక్కమ్మ కు  కాఫీ చేసివ్వు." అని అమ్మమ్మ మాటలు
వినిపించాయి.  అలాగే అని ఫ్రిడ్జ్ తీసి,  పాలగిన్నె తీసుకుంటుంటే, " మొత్తం పాలన్నీ పెట్టి చేస్తావో! ఏంటో!
అసలే  అవి చిక్కటి పాలు. కొన్ని నీళ్ళు కలుపు. అలాగే బ్రూ    కాకుండా స్టౌ పక్కనే వేరే కాఫీ పొడి ఉంటుంది. ఆ  పొడి వాడు." అని, 'పనిమనిషి  కాఫీ గీతా రహస్యం'  వినపడింది.  ' ఓహో!  ఇలా కూడా
ఉంటుందా ' అనుకొని, పాలగిన్నె తో పాటు ఇంకో చేత్తో  ఆ ఫ్రిడ్జ్ లోంచి నీళ్ళ సీసా కూడా తీసుకుని వంటింట్లోకి వెళ్ళాను.' అక్కమ్మ కాఫీ పొడి' సీసా వెతుక్కుని మూత తీసి వాసన చూస్తే ఘుమఘుమ
లాడిపోతోంది. " ఛ! అన్యాయం గా అమ్మమ్మను తప్పు గా అనుకున్నాను. పాపం అక్కమ్మ కోసం ఏదో
స్పెషల్  కాఫీ పొడి  పెట్టింది." అనుకున్నాను.


ఇందాక అమ్మమ్మ కాఫీ ఎలా కలిపిచ్చిందో  గుర్తుకుతెచ్చుకుని, అమ్మమ్మ ఇన్‌స్ట్రక్క్షన్లు  కూడా  ఫాలో అవుతూ  శ్రధ్ధగా  కొన్ని పాలు, కొన్ని నీళ్ళు, పంచదార,ఇంకా అక్కమ్మ స్పెషల్ కాఫీ పొడి వేసి కలుపుతుంటే, ఆ కాఫీ పొడి పాలలో ఎంతకీ కలవదే! ఇంతలోవెనకాల నుంచి," ఇంకా ఎంతసేపు? పెట్టావా? నేనేమైనా రావాలా?" అని అమ్మమ్మ గొంతు వినిపించింది. "అఖ్ఖర  లేదు. అయిపోయింది. ఇదిగో!  అక్కమ్మకు ఇస్తున్నా" అని ఆ కాఫీ తీసుకెళ్ళి వెనకాల గెన్నెలు తోముతున్న అక్కమ్మ దగ్గరకు పట్టుకెళ్ళి, " ఇదిగో, నీ  కాఫీ! కొంచెం కలుపుకొని తాగేసెయ్యి." అని చెప్పి ఇచ్చి వచ్చేశాను. అరగంటయింది. గంటయింది. అక్కమ్మ
గిన్నెలు తోమి ఇంకా లోపలకు తేలేదు. మా అమ్మమ్మ కొంచెం చిరాగ్గా," ఈ అక్కమ్మ ఎక్కడ కూచుంటే అక్కడే  కూచుంటుంది. అసలే ఎవ్వరూ లేక, నాలుగ్గిన్నెలు కూడా  లేవు. అయినా అవి  తోమడానికి ఎంత సేపు తీసుకుందో చూడు!" అని తిట్టుకుంటూ అక్కమ్మ దగ్గరకు  బయలుదేరింది. వెనకాలే నేనూ.


మేం వెళ్ళేటప్పటికి మాకు కనిపించిన దృశ్యం ఇదీ. తోమిన గిన్నెల ప్రక్కన  కూర్చుని  నేనిచ్చిన కాఫీ గ్లాసు ఎదురుగా పెట్టుకుని, కళ్ళల్లో, మొహంలో ఇదీ అని చెప్పలేని వింత వింత  భావాలతో అదోలా దీనంగా  చూస్తున్న  అక్కమ్మ.  ఇంక మా అమ్మమ్మకు కోపం నషాళానికంటింది. " ఆ నాలుగ్గిన్నెలు తోమి, కాఫీ తాగడానికి ఇంత సేపా??  రాను రాను నువ్వు మరీ అధ్వాన్నమైపోతున్నావు. రా ఇంక. ఇంట్లో పనంతా
అలాగే ఉంది" అని గదమాయించింది. ఐనా, ఊహూ! అక్కమ్మ లో చలనం లేదు. కనీసం మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా  మారలేదు. "ఏమైందే నీకు? కనీసం జవాబివ్వవు?" అని అమ్మమ్మ ఇంకా ఏదో  అనబోతూ ఉంటే,అప్పుడు  నోరు విప్పింది అక్కమ్మ.


నా పక్క భయం భయంగా చూస్తూ , " ఈ అమ్మయ్య కాఫీ అని ఏదో సల్లగా పట్టుకొచ్చింది. నోట్లో పెట్టుకోలేక పోతున్నా"నని  ఇంకా ఏమో చెప్పబోతోంటే అమ్మమ్మ చిరాగ్గా , "నువ్వు ఇచ్చిన  గంటకు తాగితే అది చల్లబడకుండా ఏమౌతుంది? సర్లే! వేడి చేసి ఇస్తా! ఇక్కడ తే"  అనిగ్లాసు తీసుకుంది. అంతే! అమ్మమ్మ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్!! వెంటనే నా పక్క తిరిగి, " అదేంటే, కాఫీ ఇంత చల్లగా ఉంది? అసలు స్టౌ మీద
కాయలేదా?  ఈ కాఫీ పొడి కలవనేలేదు. ఇంతకీ అసలు ఎలాచేశావ్? ఏం చేశావ్‌?"  అని అడిగింది.  నేను
తడుముకోకుండా, " నువ్వేగా,  కొన్ని పాలు,  కొన్ని నీళ్ళు,పంచదార, అక్కమ్మ కాఫీ పొడి కలిపి ఇమ్మన్నావ్?అలాగే ఇచ్చా"నని చెప్పాను.  " ఐతే మాత్రం, స్టౌ మీద కాయకుండా అలా ఎలా కలిపిచ్చావంటే"  "నువ్వు
చెప్పలేదుగా" అని గొణిగా.


అదండీ! అప్పటికి నాకు కాఫీ తాగడం తప్ప,  పెట్టడం తెలీదు. ఇన్స్టెంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ అని ఇలా
కాఫీ పొడిలో రకాలు  ఉంటాయని  కూడా తెలీదు. కాఫీ చేయడం లోని రకాలు తెలీదు.  అమ్మమ్మ నాకు
కాఫీ కలిపి ఇచ్చినప్పుడు, అప్పుడే కాచిన పాలు కావడంతో, పాలు మళ్ళీ కాయకుండా,  పంచదార,
ఇన్‌స్టెంట్ కాఫీ పొడి కలిపి ఇచ్చింది.  దాంతో మళ్ళీ స్టౌ మీద కాయనవసరం లేకపోయింది.  అక్కమ్మ
కాఫీకి కూడా నేను అలాగే ఫాలో ఐపోయాను.  కానీ అవి  ఫ్రిడ్జ్ లోని పాలు, ఫ్రిడ్జ్ లోని నీళ్ళు. అవే కలిపి,
పంచదార,  కాఫీ పొడి వేసి అసలు స్టౌ మీదే పెట్టకుండా కలిపి, ఆ కాఫీ పొడి కలవకపోవడంతో, ' నువ్వే
కలుపుకో' అని చెప్పి ఇచ్చేసి వచ్చా.  కానీ పాపం, అక్కమ్మ ది ఫిల్టర్ కాఫీ పొడి. నీళ్ళు  కాచి, కాఫీ పొడి వేసి
మరిగించి, పంచదార వేసి,  పాలు పోసి కాచి, వడగట్టి ఇవ్వాలంట.  అమ్మమ్మ ఇంత డీటైల్డ్ ఇన్స్ట్రక్షన్స్
ఇవ్వకపోవడం వల్ల, ఇంకా,  నా కాఫీ మేకింగ్  స్కిల్స్ మీద నాకు, అమ్మమ్మకూ ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌
వల్లా ఇలా జరిగిందే తప్ప, నా తప్పేమన్నా ఉందంటారా? కానీ కొన్ని సంవత్సరాల పాటు నన్ను 'అక్కమ్మ కాఫీ'  పేరుతో ఎంత ఏడిపించారో!!


కానీ ఇప్పుడు పేర్లు  పలకలేని రకరకాల కాఫీలు తాగలేక  తాగు తున్నప్పుడు నేను కూడా అక్కమ్మ ఎక్స్‌ప్రెషన్‌లు పెట్టుకుంటూ, అక్కమ్మలా  అలా దీనంగా చేతిలోని కాఫీ వైపు చూస్తున్నప్పుడు, నాకు,  నేను
చేసిన 'అక్కమ్మ కాఫీ'  గుర్తుకొస్తుంది. అదేదో అప్పటి రోజులలో కాబట్టి, కాలం ఖర్మం కలిసి రాక,  జనాలకు కొత్తదనాన్ని  ప్రోత్సహించడం తెలియక పోవడం వల్లా,  భవిష్యత్తులో  కాఫీలలో ఇలాంటి రకాలుంటాయని తెలియని అజ్ఞానం వల్లా, ఆ వెరైటీ కాఫీ అవమానాల పాలుపడి, వెక్కిరింతల చాటున మరుగున
పడిపోయింది కానీ,  అదే ఈ రోజులలో అయితేనా.... ..........
ఇంకొన్ని వెరైటీ కాఫీలు ఎక్స్పెరిమెంట్లు  చేసి,  సరికొత్త రుచులు కనిపెట్టి,  ఓ వెరైటీ మెనూ తో, ఓ కాఫీ  ఛెయిన్  ఓపెన్ చేసి,......................
ఇంకా ఏం చెప్తానో అని చూస్తున్నారా??? ఇలా బ్లాగు రాసేంత తీరిక లేని వ్యాపార వేత్త అయిపోయి ఉండేదాన్ని. కాదంటారా?



3, జూన్ 2016, శుక్రవారం

రైలు ప్రయాణం - కొన్ని జ్ఞాపకాలు

ఎక్కడికైనా ప్రయాణం అంటేనే చిన్నప్పుడు మాకు బోల్డంత ఉత్సాహం వచ్చేసేది.ఇప్పుడు రెండు గంటల ప్రయాణం అంటేనే, పిల్లలు  'జర్నీ అంతసేపా??'  అని నీరసంగా అడిగి, రకరకాల గాడ్జెట్‌లూ, వాటి ఛార్జర్లూ , తతిమ్మా సరంజామా మాత్రం ఉత్సాహంగా సర్దేసుకుంటున్నారు. ఇంక కళ్ళు ఆ గాడ్జెట్‌ లకు అప్పగించి,  చెవులకు హెడ్ ఫోన్స్‌ తగిలించుకుని, వాళ్ళ లోకంలో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. ఈ గాడ్జెట్‌ల బెడద లేని మా చిన్నప్పటి రోజుల్లో ప్రయాణం అంటే, పిల్లలకు సర్దుకోవడానికి బట్టలు తప్ప పెద్దగా ఏం ఉండేవి కాదు.  పైగా ఆ బట్టలు సర్దే డిపార్ట్‌మెంట్ అమ్మదే కాబట్టి, ఆ పని కూడా ఉండేది కాదు.


ప్రయాణం అంటే నాకు దాదాపు ప్రతీ వేసవి సెలవలకీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడమే గుర్తుకు వస్తుంది. అదేదో ఆషామాషీ ప్రయాణం కాదు సుమండీ! ఈ రోజు ప్రొద్దున దాదాపు ఏడు గంటలకు ప.గోజి లోని మా ఊర్లో రైలెక్కితే, గుంటూరు లో ఓ రైలు మారి, మర్రోజు ప్రొద్దునే గుంటకల్ లో ఇంకో రైలెక్కి, మధ్యాన్నం అనంతపురం లో దిగి బస్సెక్కితే సాయంకాలానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరేవాళ్ళం. మధ్య లో క్రాసింగ్ అనో లేదా  ఇంకేవైనా కారణాలతో కనెక్టింగ్ రైలు మిస్ అయ్యామంటే, రాత్రయ్యేది ఇంటికి చేరేటప్పటికి.


ఇక ప్రయాణానికి బట్టలు సర్దుకోవడం చిన్న పని. అంతకంటే ముందు, వెళ్ళగానే, ఏం తెచ్చారంటూ చుట్టూచేరే పిల్లలకు చిరుతిండ్లు  తయారు చేయించడం అత్యంత ముఖ్యమైన పని.  దారిలో నెమరు  వేయడానికి  మాక్కూడా అవసరమే అవి.  ఎవరన్నా వంటవాళ్ళనో,  లేకపోతే మిఠాయికొట్టు వాళ్ళకో పురమాయించి మా అమ్మ ఓ మూడు రకాలు స్వీట్లు  , ఓ మూడు రకాలు హాట్లు తయారు చేయించేది.  మిఠాయి ఉండలు, తొక్కుడు లడ్డూలు, కొబ్బరి లౌజులు, కోవా, బూందీ మిక్స్‌చర్, ఆకుపకోడీ, జంతికలు లాంటివి  . మిఠాయి ఉండలు అంటే బెల్లం పాకంలో బూందీ వేసి ఉండలు గా చుట్టేవి.ఇవి గానీ, పాకం బాగా కుదిరితే, గాఠ్ఠిగాఉండి, దంత సౌష్టవానికి పరీక్ష పెట్టేవి.


అసలు రైలు ప్రయాణం లో అత్యంత ముఖ్యమైన ఘట్టం 'విండో సీట్‌' సంపాయించడం.  మేం ముగ్గురు పిల్లలం కావడంతో, మా ఐదుమందికీ రిజర్వేషన్ లో వచ్చే రెండే రెండు విండో సీట్‌ లతో మా యుద్ధకాండ మొదలయ్యేది. మా తమ్ముడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు,  'పాపం చిన్నపిల్లాడు' అని అమ్మ కోటా లో వాడికి విండో సీట్‌ రిజర్వ్‌ ఐపోయేది. ఇంక మిగిలిన విండో సీట్‌ కోసం నేను, మా అన్నయ్య పోటీ పడేవాళ్ళం. వచ్చేమూడు స్టేషన్ల వరకు నీకు, ఆ తర్వాత మూడు స్టేషన్ల వరకు విండో సీట్‌ నాకని పంచుకుని సంధి చేసుకునే వాళ్ళం. మా ప్రక్క బెర్త్‌ లలో ఉన్నవాళ్ళకు పిల్లలు లేకపోతే, వాళ్ళు విండో సీట్‌ పాపం త్యాగం చేసి ఇచ్చేవారు. ఇక అప్పుడు చూడాలి....ఆ మొహం, ప్రపంచాన్ని జయించినంతగా,  విజయగర్వం తో వెలిగిపోయేది.



కళ్ళల్లో పడే నలకలు రుద్దుకుంటూ, కిటికీ ఊచల్లోంచి తల దూరి బైటకు వెళ్ళిపోయిందా అన్నంతగా తల ఆ ఊచలకు ఆనించి, గాలి మొహానికి గట్టిగా తాకుతుంటే , జుట్టురేగుతుంటే, కళ్ళు చికిలిస్తూ  అలా బైటకు చూస్తూ ఉండటం ఇప్పటికీ వసివాడని జ్ఞాపకం. ఆ రైలు ఊపేదానికన్నా ఎక్కువగా ఊగేవాళ్ళం. ఎంతగా అంటే, మర్రోజు రైలు దిగాక కూడా  ఇంకో రెండ్రోజులపాటు రైల్లో ఊగుతూ కూర్చున్నట్లే ఉండేది. అసలు ఆ రూట్లో వచ్చే స్టేషన్‌ల పేర్లన్నీ దాదాపుగా  కంఠతా వచ్చేవి. ఇంక అర్ధరాత్రిపూట చీకట్లో వచ్చే నల్లమల ఫారెస్టు  .  కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించేది కాదు. ఐనా సరే కిటికీ దగ్గర కూర్చోవాల్సిందే, బైటకు చూడాల్సిందే. ఆ రూట్లో ఎన్నో టన్నెల్స్‌ వచ్చేవి. ఇప్పటి పరిస్ధితి తెలీదు కానీ, అప్పట్లో  నల్లమల అడవులు బాగా దట్టంగా ఉండేవి.   ఆ చీకట్లోకి  టార్చ్‌లైట్‌ వేసుకుని అడవి జంతువులేమైనా కనిపిస్తాయేమోనని చూడటం ఇంకో సరదా జ్ఞాపకం.  అసలు ఏ జంతువులూ కనపడకపోయినా, ప్రొద్దున్నే లేచి, ఏవేవో జంతువులను చూశానని కోతలు కోసి, వాళ్ళ దిగాలు  మొహం చూసి ప్రక్కకు తిరిగి నవ్వుకోవడం. భలే ఉండేది.  మర్రోజు ప్రొద్దున్నే అడవిలో, చెట్టునే  పండిన ఈతకాయలు, జామకాయలు, కొన్నిసార్లు మామిడికాయలు,సీతాఫలాలు రైల్లో అమ్మడానికి వచ్చేవి. ఎంత రుచిగా ఉండేవో.



రైలు ఎక్కడానికి ముందే లేదా ఎక్కగానే మా డాడీ చేసే మొదటి పని వీలైనన్ని న్యూస్ పేపర్లు కొనడం.  డాడీ చదివేశాక, మేం ( ఇంగ్లీషు పేపర్లు)   చదివినట్లు  నటించేశాక, ఆ పేపర్లతో బోలెడు ఉపయోగాలు.............ఆ స్వీట్లు  వగైరాలు తినడానికి, బెర్త్ లు శుభ్రం చేసుకోవడానికి, రాత్రి భోజనాలు చేసేటప్పుడు క్యారియర్ క్రింద పరవడానికి, మా ప్లేట్ల క్రిందికి, ఆ తర్వాత మళ్ళీ బెర్త్‌ లు శుభ్రం చేసుకోవడానికి.  రైల్లో  భోజనం అంటేనే గుంటూరు గీతాకేఫ్ గుర్తొస్తుంది.  ఆ కూరలు ఎంత బావుండేవో.  అక్కడి సాంబారు మరీను.  ఇంట్లో అమ్మ చేసిన ప్రతీ కూరకు వంద వంకలు పెట్టే మేము, అదేంటో కిక్కురుమనకుండా అన్ని కూరలు  తినేసేవాళ్ళం. అందుకే అమ్మ,  పులిహోర లేదా పెరుగన్నం పట్టుకెళదామన్నా వద్దంటేవద్దని, గీతాకేఫ్ కెళదామని గొడవ చేసేవాళ్ళం.


గుంటూరు చేరేటప్పటికి మధ్యాన్నం ఒంటిగంటయ్యేది. వెంటనే లగేజి  వెయిటింగ్ రూమ్ లో పెట్టేసి ఖాళీ క్యారియర్ తీసుకుని గీతాకేఫ్ కి వెళ్ళి భోజనం చేసేసి క్యారియర్ లో రాత్రి కి భోజనాలు ప్యాక్ చేయించుకున్నాక,  దగ్గరలో ఉండే విశాలాంధ్ర కు వెళ్ళాల్సిందే.  అక్కడ గబగబా చదివినన్ని చదివేసి,  మాకు కావలసినన్ని పుస్తకాలు కొనుక్కుని తిరిగి వెయిటింగ్ రూమ్ కు వచ్చేవాళ్ళం. అక్కడ ఉండే ఇన్‌ఛార్జి  మామ్మగారు సామాను భద్రంగా చూస్తుండేవారు.  నాకు జ్ఞాపకం ఉన్నప్పటి నుండీ ఆ మామ్మగారు ఆ వెయిటింగ్ రూమ్‌ ఇన్‌ఛార్జి గా ఉండేవారు. ఆమెతో పాటు ఇంకో ఆమె కూడా ఉండేవారు. ఆమె చాలా పొట్టిగా ఓ ఏడేళ్ళ వయసు పిల్లలంత ఎత్తు మాత్రం ఉండేవారు. ఇద్దరూ కలిసి వైరు బుట్టలు అల్లుతుండేవారు. వాళ్ళకు కాలక్షేపం, ఇంకా కొంచెం ఆదాయం. మా అమ్మ రకరకాల సైజుల్లో వాళ్ళ తో బుట్టలు అల్లించుకుంది. వెళ్ళేటప్పుడు చెప్తే, ఐదారు వారాల తర్వాత తిరుగు ప్రయాణం లో వచ్చేటప్పటికి అల్లేసి ఉండేవాళ్ళు. సంవత్సరానికి రెండుసార్లే  చూసినా భలేగా గుర్తు పెట్టుకునేవారు.



' రైల్వే టైమ్ టేబుల్' అనబడే పుస్తకం అంటూ ఒకటుంటుందని ఇప్పటి గూగుల్  జనరేషన్ కు తెలియక పోవచ్చు గానీ చిన్నప్పుడు మా క్కూడా ఆ టైమ్ టేబుల్ చూడ్డం వచ్చేది. ఆ ప్రక్క బెర్త్ ల వాళ్ళకు గానీ అది చూడ్డం రాకపోతే ఇంక  మా  ఫోజులకు అంతే ఉండేది కాదు. అసలు ఆ ప్రక్క బెర్త్ ల వాళ్ళతో ఆ కాస్త సమయం లోనే ఎంత పరిచయం అయిపోయేదో తలుచుకుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. 'ఎక్కడి దాకా' తో మొదలెట్టిన మాటలు , స్టేషన్లు వెనక్కెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం ముందుకెళ్తూ  వాళ్ళు దిగాల్సిన స్టేషన్‌  వచ్చేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోయేవి. ఆ కాసేపట్లోనే 'అత్తయ్యగారూ, మామయ్యగారూ' అని వరసలు కలిసిపోయేవి. వాళ్ళు దిగిపోతుంటే బాగా కావల్సినవారు దూరం అయిపోతున్నట్టు మనసు భారంగా అయిపోయేది. ఇప్పటి ప్రయాణాలలో  వేగం, సౌకర్యాలు పెరిగాయేమో గానీ ఎప్పటికీ నా మనసులో, నా జ్ఞాపకాలలో ప్రయాణం అంటే అప్పటి రైలు ప్రయాణమే. ఇంకేం దానికి సాటి రాదు, రావు. అంతే.

21, మే 2016, శనివారం

భాష లోనేమున్నది???

ఈ సారి మా బుజ్జిగాడి చిన్నప్పటి ముచ్చట్లు కొన్ని.  వాడు చిన్నప్పుడు  తెలుగు బాగా మాట్లాడేవాడు. ఏవో కొన్ని ఇంగ్లీషు పదాలు తెలియడం తప్ప పూర్తిగా ఇంగ్లీషు లో మాట్లాడటం వచ్చేది కాదు. వాణ్ణి ప్లే స్కూల్‌ లో చేర్పించడానికి వెళ్ళినప్పుడు వాడికీ,  ప్రిన్సిపల్ కీ మధ్య జరిగిన సంభాషణ ఇది.

ప్రిన్సిపల్‌: హలో అండ్ గుడ్‌ మార్నింగ్!
బుజ్జిగాడు:  హాయ్! గుడ్ మార్నింగ్!
ప్రి: టేక్‌ యువర్‌ సీట్‌.
బు: ధాంక్యూ!
ప్రి: యూ లుక్ స్మార్ట్‌!
బు: యా! ఐ నో!
ప్రి: హౌ డూ యూ నో దట్‌ యూ లుక్ స్మార్ట్? డిడ్‌ సమ్‌వన్‌ టెల్ యూ?
బు: యా! ఆపిల్స్ అండ్ బనానాస్!
ప్రి: వాట్‌??


ఇక్కడ ఇంక నేను జోక్యం చేసుకుని, వాడికి పెద్దగా ఇంగ్లీషు రాదని, తెల్సిన కొన్ని ఇంగ్లీషు పదాలు జవాబులు గా చెప్తున్నాడని చెప్పాను.  ఆయన గాఠ్ఠిగా నవ్వి,  కానీ అక్కడ టీచర్లు చెప్పింది వాడికి అర్ధం కావాలన్నా, వాడు చెప్పేది టీచర్లకు అర్ధం కావాలన్నా, అసలు ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీషే శరణ్యం కాబట్టి, వాడికి వీలయినంత త్వరగా ఇంగ్లీషు నేర్పించమన్నాడు. అదిగో! అప్పుడు అలా మొదలైంది వాడి ఆంగ్ల భాషాభ్యాసం. చాలా త్వరగా నేర్చేసుకున్నాడు.  ఇంక అప్పటి నుండీ వాడు తెలుగులో ఇంగ్లీషునూ,
ఇంగ్లీషులో తెలుగును చూసుకోవడం మొదలెట్టాడు. మచ్చుకు కొన్ని ఇక్కడ మీ కోసం.



చిన్నప్పుడు వాడి దగ్గర సూపర్‌ హీరో కాస్ట్యూమ్స్‌ చాలా ఉండేవి. సూపర్‌మాన్‌,  స్పైడర్‌మాన్‌, బ్యాట్‌మాన్‌ అలా.  ఎప్పుడూ ఏదో ఓ సూపర్ హీరో డివిడి పెట్టుకుని, ఆ హీరో కాస్ట్యూమ్ వేసుకుని మరీ ఆ డివిడి చూస్తూ  యధాశక్తి  ఆ పాత్ర లోకి పరకాయప్రవేశం చేస్తుండేవాడు.  అప్పుడు వాడు మనసా, వాచా, కర్మణా
తనను ఆ సూపర్‌ హీరో గా ఊహించేసుకుని అలాగే ప్రవర్తించేవాడు.

(ఇక్కడ ఓ అప్రస్తుత ప్రసంగం.  'బ్యాట్‌ మాన్‌' అని వ్రాస్తుంటే గుర్తుకొచ్చింది.
నా కజిన్‌ కి చిన్నప్పుడు ఓ డౌటానుమానం ఉండేది. English లో 'Bank' అనీ, హిందీ లో 'బైంక్' అనీ తెలుగు లో 'బ్యాంకు' అనీ వ్రాస్తారెందుకూ అని.)



మళ్ళీ మా వాడి ముచ్చట్లలోకి వెళ్తే, అప్పుడు వాడికి మూడున్నరేళ్ళుంటాయి. బ్యాట్‌ మాన్ కాస్ట్యూమ్‌ వేసుకుని ఏదో బ్యాట్ మాన్‌ డివిడి చూసుకుంటున్నాడు.  ఉన్నట్టుండి  వాడికి ఏదో వెలిగింది. వెంటనే నా దగ్గరకు పరిగెట్టుకొచ్చి," మామ్! ఐ నీడ్‌ టు కాల్‌  చిన్నమామ. ఇట్స్‌ వెరీ అర్జెంట్!" అన్నాడు. "ఎందుకు
కన్నా! ఇప్పుడు ఇండియా లో వాళ్ళకు ఇంకా పూర్తిగా తెల్లవారి ఉండదు. ఏంటో నాకు చెప్పు",  అన్నాను.
ఊహూ! వినలేదు. ఓ రెండు గంటలు ఎలాగో ఓపిక పట్టి, మళ్ళీ నా వెంట పడ్డాడు, "కాల్‌ హిమ్‌ నౌ",
అంటూ.



ఇంక ఫోన్  చేయక  తప్పలేదు. మా తమ్ముడు 'హలో' అనగానే, "మామా! ఐ నౌ అండర్ స్టాండ్ వై యూ
కాల్ మీ 'గొట్టం', " అన్నాడు మా వాడు.    (పుట్టినప్పుడు మరీ సన్నగా ఉండేవాడని,  'గొట్టం'  అనీ,
అస్తమానం రెట్టలేస్తుంటాడని  'పిట్టి'  అనీ ఇలా రకరకాల పేరుతో మా తమ్ముడు,  బుజ్జిగాణ్ణి పిలిచేవాడు)
"ఏమర్ధమైంది రా?"  అని మా తమ్ముడడిగాడు. " బికాజ్‌ ఐ యామ్ బ్యాట్‌ మాన్, యూ ఆల్వేస్‌ కాల్ మీ
గొట్టం" అన్నాడు వాడు.  మా తమ్ముడికే కాదు, నాక్కూడా ఆ లాజిక్ అర్ధం కాలేదు.  ఇంక మళ్ళీ వాడే
ఎక్స్‌ప్లెయిన్‌ చేశాడు.  " యూ సీ మామా!  అయామ్‌ బ్యాట్‌మాన్‌ .  బ్యాట్  మాన్ ఈస్‌ ఫ్రమ్‌ Gotham city అండ్ తెలుగు పీపుల్ కాల్  Gotham  ఇన్‌ తెలుగూ  యాస్ 'గొట్టం'.  దట్స్‌ వై యూ ఆల్‌వేస్ కాల్‌ మీ
'గొట్టం'."  అనీ.



ఇంకోసారి మావాడు సూపర్‌మాన్ కాస్ట్యూమ్ వేసుకుని పిడికిళ్ళు బిగించి, చేతులు రెండూ ముందుకు చాపి,  సూపర్ మాన్ లా గాల్లో ఎగురుతున్నట్టు  ఆడుకుంటున్నాడు. అప్పటికి మా చిన్నతల్లి ఇంకా నెలలపిల్ల.  "కన్నా! నువ్వు సూపర్ మాన్ అయితే చిన్నతల్లి ఎవరు? " అన్నా. వాడు పరిగెట్టడం ఆపి ఓ
సారి నా పక్క, దాని పక్క చూసి " షి ఈస్ ఎ డయపర్‌ గర్ల్" అన్నాడు సీరియస్ గా.



చిన్నప్పుడు మా బుజ్జిగాడు సున్నుండలు ఇష్టం గా తినేవాడు. అందుకే మా అమ్మ ఎవరు వస్తున్నా
వాళ్ళతో సున్నుండలు పంపించేది.  లేదంటే పార్సెల్‌ పంపించేది. వాడు మా అమ్మను 'అమ్మమ్మా' అనే పిలిచేవాడు కానీ,  మా అమ్మ పేరు వాడికి తెలీలేదు. ఓ రోజు అలా పార్సెల్  వచ్చినప్పుడు బుజ్జిగాడు ఇంట్లోనే ఉన్నాడు.  ఆ  పార్సెల్  మీద 'Sunanda  Devi' అని మా అమ్మ పేరు ఉంది.  మా బుజ్జిగాడు అది చూసి, "సో, ఈస్ దిస్ అమ్మమ్మాస్ నేమ్‌?"  అని అడిగాడు. ఔనన్నాను.




వెంటనే  సీరియస్ గా ఏదో అర్ధమైనట్టు  మొహం పెట్టి,  " నో వండర్, హర్‌ సున్నుండాస్ టేస్ట్‌ సో గుడ్"
అన్నాడు. అమ్మమ్మ పేరుకీ సున్నుండలకీ లింకేంటో నాకర్ధం కాలేదు. " నా కర్ధం కాలేదు. సరిగ్గా చెప్పు
కన్నా!"అంటే అప్పుడు మళ్ళీ వివరంగా చెప్పాడు.  " యూ సీ! షి మేక్స్ సచ్ గుడ్ సున్నుండాస్ బికాస్ హర్
నేమ్‌ ఈస్ 'సున్నుండా దేవి' " అని. అమ్మ పేరు సున్నుండా దేవి ఏమిటా అని కాసేపు ఆలోచిస్తే
నాకర్ధమైంది.   'Sunanda Devi' ని వాడు  ' సున్నుండా దేవి'  గా చదువుకున్నాడన్నమాట.



మా చిన్నతల్లిని  చిన్నప్పుడు ' బుల్లి తల్లి'  అనీ ఇంకా ఏవేవో ముద్దుపేర్లతో పిలిచేదాన్ని.  ఓ రోజు మా వాడు సీరియస్ గా నా దగ్గరకు వచ్చి," మామ్!  ప్లీస్   డోన్ట్  కాల్ హర్  'బుల్లితల్లి' ఎనీమోర్." అన్నాడు. ఎందుకురా అలా పిలవకూడదంటే " యూ ఆర్  కాలింగ్ హర్ బుల్లితల్లి ఇన్‌ తెలుగు, బట్‌ షి ఈస్‌
అండర్‌స్టాండింగ్‌ ఇట్‌ ఇన్‌ ఇంగ్లీష్, అండ్‌ సో  షి ఈస్‌ బిహేవింగ్ లైక్‌ యాన్‌ ఇంగ్లీష్ Bully.  Like a big bully" అని తన వస్తువులు అన్నీ ఓ 'Bully'లా  లాగేసుకుంటుందని వాపోయాడు.


అలా వాడు  'భాష లోనేమున్నది???'  అని  హాయి గా ఏ భాషా భేధం  లేకుండా రెండు భాషలనూ own
చేసేసుకున్నాడు.  చక్కగా తెలుగు లో ఇంగ్లీషు ను, ఇంగ్లీషు లో తెలుగు నూ చూసుకున్నాడు.


9, మే 2016, సోమవారం

'అమ్మ' కాని 'అమ్మ' లు

నిన్నటి రోజంతా ఎక్కడ చూసినా, విన్నా, 'Happy Mothers Day!' అంటూ హోరెత్తిపోయింది. కానీ, దాదాపు ప్రతీ రోజూ అమ్మకు ఫోన్‌ చేసి మాటాడే నేను, నిన్న మాత్రం ఫోన్‌ చేయలేదు, మాట్లాడలేదు. ఈ సరికొత్త ప్రత్యేక రోజుల గురించి అంతగా తెలియకపోవడంతో అమ్మకు, ఈ అలవాటు ముందునుంచి లేకపోవడం తో నాకు, అలా శుభాకాంక్షలు చెప్పడం ఎందుకో కొంచెం ఇబ్బంది గా,  ఇంకొంచెం కృతకంగా అనిపిస్తుంది. ఇంత వరకు ఎప్పుడూ అమ్మకు ఈ 'అమ్మరోజు' శుభాకాంక్షలు చెప్పలేదు, ఇక మీద ఎప్పుడూ చెప్పను కూడా.


కానీ నా  పిల్లలు మాత్రం ఇక్కడ పెరగడం వల్ల, ఈ ప్రత్యేక రోజులు వాళ్ళకు బాగానే అలవాటయ్యాయి. అలా నా  'అమ్మ' పాత్రలో మాత్రం ప్రతీ సంవత్సరం, ఈ 'అమ్మ రోజు' శుభాకాంక్షలు, బహుమతులూ
అందుకుంటూనే ఉన్నాను. "నీకు ఇష్టం లేకపోయినా సరే, మా కోసం!" అంటూ పిల్లలు వాళ్ళకు చేతనైంది చేస్తుంటారు.


కానీ నేను ఈ 'అమ్మ రోజు' సందర్భం గా వాళ్ళు నాకు ఏం ఇచ్చారో, దాని గురించి వ్రాయబోవడం లేదు. మా అమ్మ గురించో, లేదా  ఓ 'అమ్మ' గా నా గురించో కూడా కాదు. ప్రతీ మనిషి లోనూ వయో, లింగ,
స్ధితిగతులతో నిమిత్తం లేకుండా అమ్మతనం ఉంటుందని నా నమ్మకం. అటువంటి కొందరు 'అమ్మ' లు కాని 'అమ్మ' ల గురించి ఇప్పుడు....


ముందుగా నా బుజ్జిగాడు......As the saying goes,"When a child is born, a mother is born too."
నాకు మాతృత్వపు అమృతాన్ని రుచి చూపించాడు. వాడి బుజ్జిబుజ్జి చేతులతో, ముద్దు ముద్దు మాటలతో, వయసుకు మించిన పరిణితితో కూడిన చేతలతో, నాకు ఎన్నో నేర్పాడు. అమ్మగా నేను ఎదగడానికి కారణమయ్యాడు.  He raised the bar for me to grow as a mother.


వైద్యపరమైన కొన్ని కారణాల వల్ల డాక్టర్ల సలహా తో మాకు వాడొక్కడే చాలనుకున్నాం. కానీ వాడి
ఒంటరితనాన్ని, తోబుట్టువు కోసం వాడి ఆరాటాన్ని చూసి తట్టుకోలేక పోయేవాళ్ళం. 'తల్లి ప్రాణాలకు
ప్రమాదం' అని డాక్టర్లు ముందే హెచ్చరించినా లెక్కపెట్టలేదు. కానీ ఇంత ప్రమాదం అని అర్ధం కాలేదు. ఇంట్లో తక్కువా, hospital లో ఎక్కువా అన్నట్టు నా నెలలు గడిచాయి. ఎప్పుడు ఏ క్షణం లో
నాకేమవుతుందో, లేదా పుట్టబోయే బిడ్డకేమవుతుందో అన్నట్టు ఎన్నో,  ఎన్నెన్నో జరిగాయి.



అదిగో ఆ సందర్భం లో ముబీన్ నా బుజ్జిగాడికి, 'అమ్మ' కాని 'అమ్మ' అయింది. తన గురించి వ్రాయాలంటే కొన్ని పోస్టులే వ్రాయాలి. ప్రస్తుతానికి క్లుప్తంగా, కానీ, ఈ పోస్టు చివర్లో.


అలా ఎన్నో సవాళ్ళు  పుట్టకుండానే ఎదుర్కొని , అసలు పుట్టడం కోసమే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని మా జీవితాల్లోకి వచ్చింది, నా చిన్నతల్లి.  పుట్టాక కూడా దాదాపు పాపం మూడు నెలలు ఆ చిట్టి ప్రాణం ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో గండాలు దాటుకుని, తన రాకతో మా జీవితాలు సుసంపూర్ణం చేసింది, నా బుల్లితల్లి.


ఆ చిన్నితల్లికి ఇంకో అమ్మయ్యాడు, నా బుజ్జిగాడు.  వాడికీ , వాడి చెల్లి కీ మధ్య దాదాపు ఆరు సంవత్సరాల
దూరం ఉంటుంది, అంతే!   కానీ తన చిట్టిచెల్లిని ఎంత ప్రాణంగా చూసుకున్నాడో! ఇప్పటివరకూ కనీసం
ఒక్కసారి కూడా కొట్టలేదు. గిల్లికజ్జాలు హద్దులు దాటలేదు.  తనకు ఎంత అపురూపమైన వస్తువైనా చెల్లి
అడిగందంటే ఇచ్చేసేవాడు. ఆడించాడు, లాలించాడు, తినిపించాడు,  నిద్ర పుచ్చాడు. తన చెల్లి కి
మాటలు, ఆటలు, పాటలు ఎన్నో నేర్పాడు.


వారి వయసుకు తగ్గట్టు స్కూల్లో స్నేహితులతో సమస్యైనా,  bullying  సమస్యైనా ఓ అమ్మ లాగే,  అవి ఎలా పరిష్కరించుకోవాలో తన చెల్లి కి నేర్పాడు. ఇప్పటికీ స్కూల్‌  నుంచి వచ్చాక, ఆ రోజు స్కూల్‌ లో ఏం జరిగిందీ, లేదా  తనకొచ్చిన సమస్య ను చిన్నితల్లి చెప్పేటప్పుడు, చాలాసార్లు  నాది ప్రేక్షక పాత్రే.  ఆ సమస్యనుండి ఎలా బయటపడాలో నా బుజ్జిగాడు సలహా  ఇస్తూ ,  అమ్మగా  నా  పాత్ర కూడా వాడు పోషించేస్తుంటే.......' అమ్మ' గా  వాడి పెంపకం లో నేను గెలిచాననే ఓ చిన్ని సంతృప్తి.  కించిత్తు గర్వం.



ఇంక నా చిన్ని తల్లి......దాని గురించి ఏం రాయాలో కూడా తెలియడం లేదు. సుకుమారమైన మనసు,  అందమైన  మనస్తత్వం,  ఎవర్నీ నొప్పించని సున్నితత్వం, తప్పొప్పుల విచక్షణ,  చిన్న పిల్లలంటే
విపరీతమైన పిచ్చి,  తనవల్ల ఎటువంటి పొరపాటు జరగకూడదనే ఆరాటం, అతి జాగ్రత్త, అతి శుభ్రత,
పెద్దలంటే గౌరవం. అన్నంటే ప్రాణం. నిజం చెప్పాలంటే అచ్చమైన బాపూబొమ్మ లా ఉంటుంది.
అమ్మ,  నాన్నల పెంపకం తో పాటు  అన్న పెంపకం కూడా తోడై,  ఆడపిల్లంటే 'ఇలా' ఉండాలని నాకనిపిస్తుంది.  ఇండియాలో సంగతి నాకు తెలీదు కానీ, ఈ మధ్య కాలంలో ఇక్కడ, చిన్నపిల్లలు, అందునా ఆడపిల్లలు సిగ్గుపడటం నేను  చూడలేదు. కానీ నా చిన్నితల్లి భలే అందంగా సిగ్గు పడుతుంది. పెద్దయ్యాక డాక్టర్  అవుతుందో ఇంకోటో  చెప్పలేను గానీ,  నా చిన్నతల్లి మాత్రం ఖచ్చితంగా ఓ మంచి 'అమ్మ'వుతుంది.


ఇంక ముబీన్‌ గురించి. తను మా బిల్డింగ్ లోనే ఉండేది. మాది 6వ అంతస్తు. తనది 10వ అంతస్తు.
మొదట్లో కేవలం ముఖపరిచయం. అంతే. వాళ్ళ అమ్మాయి,  మా బుజ్జిగాడు ఒకే స్కూలుకెళ్ళేవారు. ఆ
అమ్మాయి  వీడి కన్నా సంవత్సరం పెద్ద. ముందుగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సయిపోయారు. స్కూల్‌ బస్సు కోసం
ఎదురుచూసే సమయాలలో, నెమ్మదిగా మా ఇద్దరి  స్నేహం చిక్కబడింది.



ఇంక నేను నెలలు నిండే కొద్దీ  డాక్టర్ల చుట్టూ ,  హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతుంటే, మా బుజ్జిగాడు ముబీన్
వాళ్ళ ఇంట్లోనే  ఉండేవాడు. మొదట్లో ఏదో కొన్ని గంటలతో  మొదలై,  నెమ్మదిగా రోజుల తరబడి వాళ్ళ ఇంట్లోనే గడపాల్సి వచ్చేది. భోజనం, నిద్ర, స్నానం, హోమ్ వర్క్‌ ఇంక అన్నీ ముబీన్ చూసుకునేది. ఇలా కొన్ని రోజులు  కాదు, కొన్ని  నెలలు చూసుకుంది. వాళ్ళు మాంసాహారం లేకుండా  ముద్ద తినరు. కానీ, వీడి కోసం టొమాటో పప్పు, బంగాళాదుంపల వేపుడు, బెండకాయ వేపుడు, చారు, సాంబారు నేర్చుకుని 'అమ్మ'  లా చేసి పెట్టింది. ఇప్పటికీ మా పిల్లలిద్దరికీ  'ముబీనాంటీ'  అంటే ఎంతో ప్రేమ. ఇంక తన సంగతి చెప్పక్కరలేదు.



అంతే కాదు, నా చిన్నితల్లి కూడా వాళ్ళ ఇంట్లో సభ్యురాలయి పోయింది.  పుట్టాక కొన్ని నెలలపాటు నా
చిన్నితల్లి, రాత్రంతా మేలుకుని పగలు నిద్ర పోయేది. పిల్లలు స్కూలుకి  వెళ్ళగానే ముబీన్ వచ్చి, "నువ్వు
కాసేపైనా  నిద్రపో. లేచి  పని చేసుకున్నాక  వచ్చి పాపను తీసుకో"మని  చెప్పి  చిన్నతల్లిని తీసుకొని వెళ్ళిపోయేది. నేను పనంతా చేసుకుని వెళ్ళేసరికి ఒక్కోసారి మరీ  ఆలశ్యం అయితే,  తను దానికి స్నానం కూడా  చేయించేసి ఉండేది. వాళ్ళ ఇంట్లో మా  పిల్లల బట్టలు, ఇంకా చిన్నతల్లికి అవసరమైన  సామాగ్రి  లాంటివి  కొన్ని,  పెట్టి ఉంచేదాన్ని. అలా ముబీన్ నా చిన్నితల్లి కి కూడా  'అమ్మ' కాని 'అమ్మ'యిపోయింది.
మేము ఆ దేశం వదిలి వచ్చి ఇప్పటికి ఆరేళ్ళ పైనే  అయింది.  మొన్న డిసెంబరు నెలలో మళ్ళీ ఆ దేశం వెళ్ళి ముబీన్ ను కలవగలిగాం.  ఇప్పటికీ అదే ప్రేమ. అదే అభిమానం.


Mubeen! This is for you on the occasion of Mother's Day!
'Thank you' is too small an expression  that doesn't wholly, completely  and aptly convey our feelings for all that you have done.
Thank you for being there for us.
Thank you from both of them and from me too.




24, ఏప్రిల్ 2016, ఆదివారం

నా పేరు వెనక ఉన్న వినూత్నమైన కధ

నా పేరు వెనక ఉన్న వినూత్నమైన కధ తెలుసుకోవాలంటే కధలోకి దూకేయండి మరీ!


మా పేరెంట్స్‌ కు, వాళ్ళ పెళ్ళైన దాదాపు పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టక పోవడంతో ఇరువైపుల పెద్దలూ ఎడాపెడా వాళ్ళ వాళ్ళ ఆరాధ్య దైవాలకు  బిడ్డ పుడితే పేరు పెట్టుకుంటామని, ఇంకా ఏంటేంటో
మొక్కేసుకున్నారంట. ఆ తర్వాత మొదలైంది అసలు కధ. మా అన్నయ్య పుట్టాడు. వంశాంకురమనీ, వారసుడనీ  మా నాన్నగారి వైపు వారు పంతం పట్టి, ఎలాగైతే మా అన్నయ్యకు పేరు పెట్టేసుకున్నారు. అందరి మొక్కులూ తీరేలా ఓ చేంతాడంత పేరు పెట్టడానికి మా పేరెంట్స్‌ ససేమిరా అన్నారు. దాంతో మా అమ్మగారి వైపు  వాళ్ళ మొక్కులు తీరలేదు. దాంతో వాళ్ళు వాళ్ళ మొక్కులు చెల్లించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.


ఇక నేను పుట్టాను. (ఇక్కడ అక్కినేని గారి, ' నేను పుట్టాను' పాట బ్యాగ్గ్రౌండ్‌లో వస్తుంటుంది)
మళ్లీ అందరికీ వాళ్ళ వాళ్ళ మొక్కులు గుర్తుకొచ్చాయి. ఈసారి పేరు పెట్టి, మొక్కులు తీర్చుకునే అవకాశం, హక్కు మాదంటే మాదని ఇరు ప్రక్కల పెద్దలూ మళ్లీ మొదలెట్టారు. ఈ గోల భరించలేక కొన్ని రోజులు డిలే చేస్తే వాళ్ళలో ఎవరో ఒకరు తగ్గుతార్లే అని  మా పేరెంట్స్‌,  నా నామకరణం వాయిదా వేశారు. అది ఏ ముహూర్తం లో వాయిదా వేశారో గానీ అలా వాయిదా పడుతూనే ఉంది. ఎన్ని రోజులైనా ఇరుప్రక్కల పెద్దలూ ఇంచి కూడా తగ్గలేదు. ఎవరినీ నొప్పించడం ఇష్టం లేక కాలం మీద భారం వేసి మా వాళ్ళూ సైలెంట్ ఐపోయారు.  ఈలోగా నెలలు, సంవత్సరాలు గడిచాయి. నాకు నాలుగేళ్ళు నిండాయి. అయినా ఊహూ! ఎవరూ తగ్గలేదు. దాంతో ఇంకా అనామిక గానే మిగిలిపోయాను పాపం!



ఈలోగా మా అన్నయ్యను మా వీధి చివరలో ఉన్న బళ్ళో వేశారు. వాడు స్కూలుకెళ్ళడానికి తెగ మారాం
చేసేవాడంట. చాలా ఏడ్చేవాడంట. రోజూ బలవంతాన లాక్కెళ్ళి స్కూల్ లో దింపాల్సి వచ్చేదంట.
మా అమ్మ చెయ్యి పట్టుకుని లాక్కెళుతుంటే వాటర్ స్కీయింగ్ చేస్తున్నట్టు చేతికి  వేళ్ళాడుతుండేవాడంట. ఎలాగోలా లాక్కెళ్ళి స్కూల్‌  లో దించేసి వస్తే, మా అమ్మ ఇల్లు చేరేలోగా వీడు పరిగెట్టుకుని వచ్చేసి ఇంట్లో దాక్కునే వాడంట. ఒకసారి అలాగే మా అన్నయ్యను మళ్లీ లాక్కెళ్ళి ఎలాగో స్కూల్‌ లో దింపి ఇంటికి వచ్చి చూస్తే నేను కనపడలేదు.  అందరూ కంగారుపడి వెతకడం మొదలెట్టారంట. ఈ లోగా నేను మా అన్నయ్య
 క్లాసు లో కూర్చొని ఉన్నానని తెలిసి అందరూ 'హమ్మయ్య' అని ఊపిరి తీసుకున్నారు. ఇంతకీ ఏం
జరిగిందంటే...........



........మా అన్నయ్య, అమ్మ ఇలా స్కూలుకూ ఇంటికి,  తిరుగుతుంటే, నాలుగేళ్ళున్న నేను నా  అంత పొడవున్న మా అన్నయ్య పుస్తకాల సంచి భుజం మీంచి అట్నుంచి ఇటు వేసుకొని,  ఆ స్కూలుకెళ్ళి నా క్కనిపించిన క్లాసులో కూర్చున్నాన్నంట.  నేను స్కూల్లో ఉన్నానని తెలిసి మా అమ్మ తీసుకెళడానికి  వచ్చి రమ్మంటే రానని ఏడ్చానంట. "పోన్లెండి! చిన్నపిల్లను ఏడిపించడం ఎందుకు? సరదా పడుతోంది. కాసేపు కూర్చోనివ్వండి, ఏడ్చినపుడు ఇంటికి పంపిస్తాము. మీ అబ్బాయికి ఉన్నట్టు స్కూలంటే  భయం లేకుండా  పోతుంది,"  అని మాస్టారు గారు అంటే సరే నని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కూర్చోవడం కూర్చోవడం, స్కూలు అయ్యేవరకు కూర్చున్నానంట. ఇక నాతో పాటు మా అన్నయ్య కూడా కూర్చోవలసి వచ్చింది  పాపం.




మర్రోజు మళ్లీ పొద్దున్నే మా అన్నయ్య మా అమ్మ చేయి పట్టుకుని స్కూలుకెళ్ళడానికి  ఏడుస్తూ  రోడ్డుమీద
యధావిధిగా స్కీయింగ్ ప్రాక్టీసు చేస్తుంటే నేను మాత్రం మా అన్నయ్య సంచి భుజం మీద వేసుకొని
డింగు డింగుమని నడుచుకుంటూ వెళ్ళి క్లాసులో కూర్చున్నానంట.  ఇంటికి రమ్మంటే రానని ఏడుపు. మళ్ళీ సీన్ మామూలే. "కూర్చోనివ్వండి. ఎంత సేపు కూర్చుంటుంది? ఎన్ని రోజులు కూర్చుంటుంది? పాప కూర్చుంటే కనీసం వాళ్ళ అన్నయ్య కాసేపు కూర్చుంటాడు" అని మాస్టారు గారనడంతో 'నేనుంటే మాఅన్నయ్య కూడా ఏడవకుండా కూర్చుంటాడు. పన్లో పనిగా నాకూ రెండక్షరమ్ముక్కలొస్తాయని' మా అమ్మ ఆశ పడింది గానీ............



................రాబోయే ఉపదద్రవాన్ని ఏమాత్రం ఊహించలేదు పాపం. అదిగో! సరిగ్గా అక్కడే ఎవరికైనా
జీవితంలో ఒక ఐడెంటిటీ నిచ్చే పేరు, ఇంతమంది ఎన్నో మొక్కులు మొక్కుకుని,  మా హక్కంటే మా హక్కని
భీష్మించుకుని, ఎన్నో ప్లాన్లు వేసుకొని పెట్టాలనుకుంటున్న పేరు వీళ్ళందరి చేయి జారిపోయింది. ప్చ్‌!!!



ఇలా మా అన్నయ్య కంటే ఠంచనుగా, శ్రద్ధగా నేను  స్కూలుకెళ్తుంటే మా వాళ్ళు మురిసిపోతూ ఉండగా
నాకు స్కూల్‌ లో జాయిన్ చేసే అసలు వయసు వచ్చిందంట. సరే! నన్ను  తీసుకెళ్ళి ఫార్మల్‌ గా  జాయిన్ చేయబోతే, "ఇన్ని నెలలుగా స్కూల్ కు వస్తోంది. మీ అమ్మాయి అడ్మిషన్‌ ఫార్మాలిటీస్ అన్నీ ఎప్పుడో అయిపోయాయి" అన్నారంట ఆ మాస్టారు. "అదేంటీ?  దానికి ఇంకా పేరే పెట్టలేదు. ఆ పేరు కోసం ఇంట్లో రెండు వైపుల పెద్దవాళ్ళూ, ఢీ అంటే ఢీ  అంటుంటే  మీ అంతట మీరు రికార్డ్స్‌ లో ఏం పేరు
రాసేసుకున్నారు?" అని వీళ్ళు కంగారు పడుతూ అడిగితే  ఆయన చల్లగా చెప్పేరంట, ' అమ్మాయి చక్కగా
ఉందని ఫలానా పేరు రాసేసుకున్నాము'  అని, నాకు వాళ్ళు రిజిస్టర్‌ లో రాసుకున్న  పేరు రివీల్ చేశారంట.


"ఈ పేరేదో బానే ఉంది, రికార్డ్స్‌ లో రిజిస్టర్‌ అయిపోయింది, మార్చడానికి లేదని  చెప్తే ముఖ్యంగా ఈ
పెద్దవాళ్ళ పట్టుదలల తలనొప్పి ప్రాబ్లమ్‌ సాల్వ్‌ ఐపోతుందని" వీళ్ళూ  సంబరపడిపోయారు.  కానీ నా గురుంచి ఎవరూ ఆలోచించలేదు. అదిగో అలా నా పేరు మా వాళ్ళెవరి చేత్తోటి కాకుండా అలా ఎవరివల్లో, అత్యంత (అ)సాధారణ పరిస్ధితులలో  పెట్టబడింది. ఇన్నేళ్ళుగా నేను  ఆ పేరు తోనే చలామణి ఐపోవాల్సి వచ్చింది.  ఇంక ఆ పేరు తో నేను పడ్డ కష్టాలు మరోసారి.

కానీ మొన్న దుర్ముఖి నామ సంవత్సర ఉగాది రోజు, ఇక బ్లాగు వ్రాయాల్సిందే అని గాఠ్ఠిగా డిసైడ్‌ చేసేసుకుని అప్పటికప్పుడు నా pseudonym ' శ్రీ '  గా నాకు నేనే నామకరణం చేసేసుకున్నాను.  అలా రెండుసార్లూ  నా నామకరణ మహోత్సవం అలా హడావుడిగా,  ఏ హడావుడి లేకుండా జరిగిపోయిందన్నమాట.
ఇదండీ నా పేరు వెనక ఉన్న విచిత్రమైన కధ. ఇలాంటి వింత  కధ ఎవరి పేరు వెనకా ఉండదని నా ప్రగాఢ నమ్మకం.


మరి మీరేమంటారు???





21, ఏప్రిల్ 2016, గురువారం

'బ్రూస్ లీ డైలాగ్' లంటే ఏంటంటే....

మీ కందరికీ ఇంగ్లీషు లో 'టు రీడ్‌ ఇన్‌ బిట్‌వీన్‌ ద లైన్స్‌' అన్న సంగతి తెలిసే ఉంటుంది. అదిగో ఆ నైపుణ్యం నాకు చిన్నప్పటినుండీ కొంచం తక్కువే. ఎవరైనా హింట్ ఇచ్చినా పట్టుకోలేక పోయేదాన్ని. ఇప్పటికీ ఆ విషయంలో పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ లేదనుకోండి. అలాంటి సందర్భాలలో ఒకటి మీ కోసం.


నా చిన్నప్పుడు మా అన్నయ్య, తమ్ముడి వల్ల మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. షావొలిన్ టెంపుల్ సిరీస్, బ్రూస్‌లీ సినిమాలు వగైరాలన్నమాట. అలా చూసి చూసి, బ్రూస్‌లీ కి పెద్ద ఫాన్‌ అయిపోయాను. గ్యాప్ ఇవ్వకుండా అలా ఎడా పెడా తన్నడం భలే నచ్చేది నాకు. కానీ మధ్యలో ఎందుకో ఆ సినిమాలు చూడ్డం కొంచం గ్యాప్ వచ్చింది.


అప్పుడు మేం వేసవి శెలవులకు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాం. అవి వీడియో క్యాసెట్‌ రోజులు. పిల్లలనందరినీ మధ్యాన్నం పూట ఇంట్లోనే ఉండేలా చేయడానికి రోజూ ఓ రెండు క్యాసెట్లు అద్దెకు తెచ్చేవారు. ఆ రోజు మా పెద్ద మావయ్య మాకిష్టమని బ్రూస్‌లీ సినిమా క్యాసెట్ తీసుకొచ్చాడు. బ్రూస్ లీ సినిమా అని నేను గెంతుకుంటూ వెళ్ళి కూర్చున్నాను. ఆ ఊళ్ళోనే ఉండే మా దూరపు  బంధువుల అబ్బాయి అదే టైం లో మా ఇంటికి వచ్చాడు. తను కూడా సినిమా చూట్టానికి కూర్చున్నాడు. ఆ అబ్బాయి అప్పట్లో కరాటే నేర్చుకొంటుండేవాడంట. తనను తాను బ్రూస్ లీ లెవెల్ లో ఊహించుకునేవాడంట. మనకు ఈ డీటైల్స్ ఏవీ తెలీవు. సినిమా మొదలైంది. బ్రూస్ లీ  టీవీ మీద కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసి పోతున్నాడు. అది గమనించి మా మావయ్య ఇంకాస్త ఎగేస్తున్నాడు, " అరే!  నువ్వచ్చం బ్రూస్ లీ లాగే ఉన్నావురా" అని. ఆ అబ్బాయి ఇంకా మురిసిపోతున్నాడు. మా మావయ్య మరింత ఎగేస్తున్నాడు.  కానీ అదేదీ నా తలకెక్కడం లేదు. అసలేదీ గమనించే పరిస్ధితి లో కూడా నేను లేను. ఎందుకంటే..........


...... చిన్నప్పుడు నేనెంతో అభిమానించిన బ్రూస్ లీ నాకు కొత్తగా కనిపిస్తున్నాడు.  పీలగా, బక్కగా, ఏంటో అస్సలు నా టీనేజి కంటికి ఆనలేదు. మొహంలో ఎటువంటి హావభావాలు లేకుండా, ఊరికే అడ్డు ఆపు లేకుండా, అసలెందుకు తంతున్నాడో ఏంటో అర్ధమయ్యే గ్యాప్ ఇవ్వకుండా, కనిపించే అందర్నీ ఒకటే తన్నడం!  భలే నిరుత్సాహం వేసింది.  అసలు నా చిన్నప్పటి నా హీరో బ్రూస్ లీ ఈ స్క్రీన్‌ మీది బ్రూస్ లీ  ఒక్కడేనా అని ఓ పెద్ద డౌటానుమానం కూడా వచ్చింది.  నేనిలాంటి పరిస్ధితి లో ఊపిరాడకుండా మునుగుతూ తేలుతుంటే.........

బ్యాక్‌గ్రౌండ్ లో మా మావయ్య..... "ఒరే! నువ్వచ్చం బ్రూస్ లీ లానే ఉన్నావురా!"అన్న మాటలు స్టీరియో ఎఫెక్ట్‌ తో, రీ సౌండ్ తో నా చెవులలో వినిపిస్తున్నాయి.  నా కళ్ళకు బ్రూస్ లీ మొహం, చెవులకు బ్రూస్ లీ
అన్న పదం తప్ప ఇంకేం కనపడటం లేదు, వినపడటం లేదు.  'బ్రూస్‌ లీ' అన్న మాట వినపడటం
ఆలస్యం, నేను నా నిరుత్సాహాన్నంతా నా గొంతులో నింపుకొని, " ఛీ! బ్రూస్ లీ ఇలా ఉన్నాడేంటి?" అన్నాను. మా మావయ్య, ఆ అబ్బాయి ఇద్దరూ యధాశక్తి ఖంగు తిని, వెంటనే సంభాళించుకున్నారు.


 కానీ నేను మాత్రం నా నిరుత్సాహాన్ని ఎట్టి పరిస్ధితి లోనూ సంభాళించుకునే స్థితి లో లేను. చుట్టుపక్కల జరుగుతున్న విషయం గ్రహించుకునే స్ధితి లోనూ లేను. కొంచం గ్యాప్ ఇచ్చి, ఆ అబ్బాయిని ఓదార్చడానికన్నట్టు  మళ్లీ మా మావయ్య మొదలెట్టాడు, "ఒరే నీవచ్చం బ్రూస్ లీ......" అని. బ్రూస్ లీ పేరు వినపడటం ఆలశ్యం, వెంటనే నేనూ మొదలెట్టాను, "ఛీ బ్రూస్ లీ ఇలా ఉన్నాడేంటి?" అంటూ. మా మావయ్య నాకు చేత్తోటి, కంటి తోటి తెగ సైగలు చేసేస్తున్నాడు. కానీ నా కంటికి బ్రూస్ లీ తప్ప ఇంకేం
కనిపించట్లేదు. నా కర్ధమైందనుకొని పాపం మా మావయ్య మళ్లీ మొదలెట్టాడు. వెంటనే అందుకుని నేనూ
సిన్సియర్ గా 'ఛ' గుణింతం వల్లిస్తూ  ఫాలో ఐపోయాను.


మిగిలిన వాళ్ళందరూ నా వైపు, ఆ అబ్బాయి వైపు టెన్నిస్ మ్యాచ్‌ చూస్తున్నట్టు  చూస్తున్నారు. పాపం ఆ
అబ్బాయి ఇబ్బందిగా మెలికలు తిరిగిపోతున్నాడు. సైగలు కాదు కదా డైరెక్ట్‌ గా చెప్పినా నేను  అర్ధం చేసుకునే టైపు కాదని గ్రహించుకుని మా మావయ్య ఇంక వదిలేశాడు. నేను మాత్రం ప్రపంచం లోని నిరుత్సాహాన్నంతా నా మొహం లోనూ,  గొంతు లోనూ నింపుకొని మధ్య మధ్య లో "ఛీ బ్రూస్ లీ ఏంటి, ఇలా ఉన్నాడు?" అని మంత్రం జపిస్తున్నట్టు  అంటూనే ఉన్నాను.


ఇంక ఆ అబ్బాయి చేత కాలేదు పాపం. "పనుందంకుల్. వెళ్ళొస్తా!" అని అక్కడనుండి పారిపోయాడు. ఆ తర్వాత కూర్చోపెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే కానీ మనకర్ధం కాలేదు. కానీ పాపం, అప్పటినుండీ ఆ అబ్బాయి పేరు బ్రూస్ లీ గానే స్ధిరపడిపోయింది.  అలాగే అప్పటినుండీ మా ఇంట్లో ఇలాంటి అసందర్భపు డైలాగులకు 'బ్రూస్ లీ డైలాగ్' లనే పేరూ స్ధిరపడిపోయింది. అదండీ! నా బ్రూస్‌ లీ డైలాగ్ ల వెనకున్న కధ.
















12, ఏప్రిల్ 2016, మంగళవారం

మా సైట్ సీయింగ్ ప్రహసనం



మా సైట్ సీయింగ్ ప్రహసనాన్ని అవధరించండి మరి.

లండన్ వెళ్ళిన క్రొత్తలో మాకు కారు లేక పోవడంతో లోకల్‌ ట్రైన్ లేదా బస్సు లో తిరిగేవాళ్ళం.  మొట్టమొదట సారి గా సైట్‌ సీయింగ్ కు వెళ్ళినపుడు టూరిస్టుల సౌలభ్యం కోసం నడిచే, 'బిగ్‌ బెన్‌' కంపెనీ వారి  'హాప్‌ ఆన్‌, హాప్‌ ఆఫ్' బస్సు ఎక్కాం. ఆ టికెట్ కొంటే ఆ రోజంతా ఆ కంపెనీ వారి ఏ బస్‌ అయినా, ఏ స్టాప్ లో అయినా ఎక్కచ్చు, దిగచ్చు.

అది డబల్‌ డెకర్‌ బస్సు.  పైన ఓపెన్‌ టాప్ ఏరియా లో కూర్చుందామని మెట్లు ఎక్కుతుంటే, నీట్ గా ఇన్‌షర్ట్‌ చేసుకుని, ఎడమ చేతిలో కొన్ని హెడ్‌ఫోన్‌ సెట్లు  పట్టుకొన్న ఓ యువకుడు, కుడిచేతిలో ఓ హెడ్‌ ఫోన్‌ సెట్‌ పట్టుకొని, చిరునవ్వు తో,  "వుడ్‌ యు లైక్ టు హావ్ ఎ హెడ్ ఫోన్‌ సెట్ సర్?" అని ఎంతో మర్యాదగా మావారిని అడిగాడు. దానికి ఈయన చెయ్యి, తల అడ్డంగా ఊపుతూ,  "నో, ధాంక్స్‌" అని ఆ అబ్బాయికి చెప్పి,  వెనక వస్తున్న నా వైపుకు తిరిగి, లోగొంతుక తో "ఇండియా లోలాగానే,  ఇక్కడ కూడా బస్సుల్లోనూ, రైళ్ళలోనూ అవీఇవీ అమ్ముకునే వాళ్ళుంటారు. వాటి క్వాలిటీ ఏం బాగోదు. నువ్వు అలాంటివి ఏవీ తొందరపడి తీసుకోవద్దు" అన్నారు.

నేను అలాగే అని బుద్ధిగా తల ఊపి, తల ఇంకోవైపుకు తిప్పేసుకుని, ఆ అబ్బాయి ఏం చెప్పేది వినకుండా, గబగబా మెట్లు ఎక్కేసి తన ప్రక్కనే కూర్చున్నా.  దాదాపుగా అన్ని సీట్లు  నిండిపోయున్నాయి. మాది లాస్ట్‌ సీట్‌.  బస్సు లండన్ రోడ్లలో నెమ్మదిగా వెళుతోంది.  కొన్ని బిల్డింగ్ ల దగ్గర కొద్దిసేపు ఆగి మళ్లీ

బయలుదేరుతోంది

కొంచెం సేపయిన తర్వాత మేం గమనించినదేమిటంటే, మా ముందున్న అందరూ,  కీ ఇచ్చిన మరబొమ్మల్లా అందరూ ఒక్కసారే కుడివైపుకు, మళ్లీ  కొంచెంసేపు ఐన తరువాత ఎడమవైపుకు తిరిగి
చూస్తున్నారు. వెంటనే ఏం అర్ధం కాలేదు. కొన్ని సెకన్ల తరువాత వెలిగింది, వాళ్ళందరూ హెడ్‌ఫోన్లు
పెట్టుకొని ఉన్నారనిన్నీ, దాన్లోంచి ఆ లాండ్‌మార్క్‌ బిల్డింగ్ ల గురించిన రన్నింగ్ కామెంటరీ వింటున్నారనిన్నీ, మాకు పాపం ఆ అబ్బాయి హెడ్‌ఫోన్‌ అమ్మచూపలేదనిన్నీ, కేవలం ఇవ్వచూపాడనిన్నీ,
మేము ఏదేదో ఊహించేసుకొని ఆ  హెడ్ ఫోన్‌  తృణీకరించామనిన్నీ వగైరా వగైరా!

అయిందేదో అయింది, మళ్లీ ఆ అబ్బాయినడిగి రెండు హెడ్‌ఫోన్‌ సెట్లు  తెమ్మంటే ఈయనకు అహం అడ్డొచ్చింది. 'ఈ మూకీ సినిమా నేను చూడను, ముందెళ్ళి తెస్తారా లేదా'. అన్నా కదలకుండా కూర్చున్నారు.
ఇలా కాదని నేను కిందకెళితే, నన్ను చూడగానే ఆ అబ్బాయి రెండు హెడ్‌ఫోన్‌ సెట్లు చేతిలో పెట్టాడు.
నాకు మాత్రమే తెచ్చుకుందామని అనిపించినా పోన్లే పాపం అని రెండూ పట్టుకొచ్చాను. ఇంక మేం కూడా అందరితో పాటు అటూఇటూ తల తిప్పి చూడటం మొదలు పెట్టాం.


అంతలో మేడమ్‌ టుసాడ్ వాక్స్‌ మ్యూజియం వాక్స్ మ్యాజియం స్టాప్ వచ్చింది. అది చూడాలనుకొని అక్కడ దిగి, టికెట్ కొనుక్కుని క్యూ లో  నించున్నాం. క్యూ నెమ్మదిగా కదులుతోంది. కొద్ది సేపట్లోనే
మైన్‌ డోర్ దగ్గరకు వచ్చేశాం. లోపలికి ఎంటరవ్వగానే కుడిచేతిప్రక్క ఒక పోలీసాఫీసర్‌ టికెట్ చెకింగ్ కోసం చెయ్యిచాపి నించున్నాడు. టికెట్స్‌ చూపిస్తే ఎంతకీ తీసుకోడే! కొన్ని సెకన్ల తర్వాత వెలిగింది, అదికూడా ఓ వాక్స్‌ బొమ్మే అని. కాకపోతే మాలాగే అందరూ చేయబోవడం కొంతలో కొంత ఓదార్పు. ఆ మ్యూజియం లోప్రపంచంలోని ముఖ్యనాయకులు, మేటి క్రీడాకారులు, హాలీవుడ్ స్టార్లు , బ్రిటిష్ రాయల్‌ ఫామిలీతో సహా
ఇంకా ఎందరివో లైఫ్ లైక్ బొమ్మలున్నాయి. అక్కడ గుర్తు పట్టగలిగిన వాళ్ళందరి వాక్స్‌ బొమ్మలతోనూ
ఫోటోలు తీసేసుకున్నాం. అప్పటికి అక్కడ కేవలం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వి తప్ప
మరే ఇతర ఇండియన్స్‌ బొమ్మలూ లేవు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళ బొమ్మలు అంత బాలేవు.

ఆ తర్వాత ఇక ఆ రోజుకు చాలించి ఇంటికి వెళ్ళిపోయాము.










10, ఏప్రిల్ 2016, ఆదివారం

Excuse me lady! You're beautiful!



నేనేనండీ  ఆ beautiful lady ని.
ఆ beautiful lady వెనకున్న కధాకమామీషు ఏంటో తెలుసుకోవాలంటే ఇక చదివేయండి మరి.

1998. అప్పుడు మేం మా వారి ఉద్యోగరీత్యా లండన్ లో ఉండేవాళ్ళం. అదే మా మొదటి పరదేశవాసం. అన్నీ కొత్తే,  అన్నీ వింతే. కళ్ళు ఇంతింత చేసుకొని అలా చూస్తుండేదాన్ని.

మావారి అమ్మమ్మగారు అంటుండేవారంట, ఈజన్మలో
వస్త్రదానం చేయకపోతే, వచ్చే జన్మలో విదేశాలలో పుట్టి, వేసుకోవడానికి బట్టలు కరువౌతాయని. ఈ వీసా ప్రాబ్లమ్స్‌ అవీ లేకుండా ఈ షార్ట్‌ కట్ రూట్‌ ఏదో బావుందని వీళ్ళందరూ సంబరపడిపోయేవారనుకోండి!

కానీ ఆ విదేశంలో అందరూ కనీసం చేతి చిటికెనవేలు కూడా కనపడకుండా  చేతులకు గ్లౌజులు కూడా  వేసుకొని కనపడేవారు. ఆ శాపం ఈ దేశంవారికి వర్తించదేమో, ఎందుకంటే వీరికి ఇదే స్వదేశం కదా, అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ కొన్నిరోజుల తర్వాత అర్ధమైంది అది ఱుతుప్రభావమే కానీ దానప్రభావం కాదని.

ఒక్కదాన్నే ఇంట్లో బోర్ కొడుతుందని అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి కూర్చునేదాన్ని. అక్కడినుంచి
ఇంక అలా  సైట్‌సీయింగ్‌ కు వెళ్ళిపోయేవాళ్ళం.


ఒకరోజు తను 'మధ్యాన్నం కల్లా ఆఫీస్కు వచ్చేసెయ్యి. తొందరగా  సైట్‌సీయింగ్‌కు వెళదాం' అనడంతో
మధ్యాన్నం మూడు గంటలకు బయలుదేరాను. మా ఇంటినుండి వాళ్ళ ఆఫీస్ కు రెండు ట్రైన్లు
మారి వెళ్లాలి. నేను ట్రైన్ మారడానికి దిగిన స్టేషన్‌ ఏమో అండర్‌గ్రౌండ్‌.  ఆఫ్ పీక్ అవర్స్‌ కావడంతో
స్టేషన్‌ అంతా ఖాళీగా ఉంది. ఎక్కడో ప్లాట్‌ఫారం చివర ఒక ఆజానుబాహుడైన ఒక మనిషి దిగాడు.
అంతే, ఇంక ప్లాట్‌ఫారంఅంతా ఖాళీ. దాంతో వెంటనే గబగబా నడవడం మొదలుపెట్టాను.


నేను ఎక్కవలసిన ఇంకో  ట్రైన్ వేరే  ప్లాట్‌ఫారంకు వస్తుంది. బ్రిడ్జి క్రాస్‌ చేసి వెళ్ళాలి. నేను నడుస్తున్నాను. నా వెనకాలే  అడుగుల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూడకుండానే నడక కొంచం వేగం పెంచాను. వెంటనే నా వెనకే వస్తున్న ఆ అడుగుల వేగం కూడా పెరిగింది. ఈ సారి నడక
ఇంకా బాగా వేగం పెంచి, కొద్దిగా తల తిప్పి వెనక్కి చూశా.  నాతో పాటు ట్రైన్ దిగిన ఆ వ్యక్తి పెద్ద పెద్ద అంగలతో నా వెనకాలే వస్తూ ఏదో అంటున్నాడు.

"Excuse me lady!, Please stop!  You're beautiful!"
అంటూ ఇంకా ఏదో అంటున్నాడు.

ఇంకంతే!  విపరీతంగా భయపడిపోయాను. కాళ్లూచేతులూ వణికిపోతున్నా, ఎలాగో పరుగెత్తడం మెదలుపెట్టాను. ట్రైన్ సంగతి దేవుడెరుగు! ముందీ స్టేషన్‌ నుంచి బయటపడి,  జనాలుండే చోటికి వెళ్ళాలని నా ఆలోచన. ఓ పదడుగులు కూడా పరుగెత్తి ఉండను, ఆ వ్యక్తి  నాలుగంగల్లో  నన్ను చేరుకుని, నా ముందు నించోని, ఏంటో చెప్తున్నాడు. ఏం చేయాలో తెలీలేదు. వణికిపోతూ నించున్నాను. నాకళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి.

 "Are you ok? Is everything alright?" అనడం వినిపించడంతో, కళ్ళు తుడుచుకొని అతని వైపు సరిగ్గాచూశాను.
అతని చేతిలో నా దుపట్టా!!!

ట్రైన్‌ దిగి గబగబా నడుస్తున్నప్పుడు  ఎక్కడో జారి పడిపోయినట్టుంది. పాపం! అది నాకివ్వడంకోసం
నా  వెనకాలే వచ్చాడు. తప్పుగా అర్ధం చేసుకున్నందుకు ఎంతో సిగ్గుగా అనిపించింది.   పదేపదే sorryఇంకా చాలా thanks చెప్పి, నా దుపట్టా తీసుకొని బయలు దేరాను.

ఇంతకీ  పాపం అతనన్నది, "Excuse me lady! Please stop! Your beautiful scarf  fell down!", అని.  అది నాకు "Excuse me lady! Please stop! You're beautiful," లాగ వినపడటంతో, పూర్తిగా వినే  ప్రయత్నం చేయకుండానే నాకు తోచింది అర్ధం చేసుకుని, తప్పుగా ఊహించేసుకొని,  భయపడిపోయాను.  అతను మాత్రం "That's alright!", అంటూ నవ్వుకుంటూ  వెళ్ళిపోయాడు.

ఇప్పటికీ ఎప్పుడన్నా మెట్రో ఎక్కినప్పుడు ఈ సంగతి గుర్తొచ్చి నవ్వొస్తుంది.

ఇదండీ ఆ టైటిల్‌ వెనకాల కధ.

మా సైట్ సీయింగ్ విశేషాలు మరోసారి రాస్తానే!

7, ఏప్రిల్ 2016, గురువారం

ఉగాది శుభాకాంక్షలతో నా బ్లాగారంగేట్రం

 నమస్తే!
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఈ బ్లాగ్ ప్రపంచానికి నేను కొత్తే అయినా, బ్లాగులు నాకు కొత్త కాదు.
ఎన్నో ఏళ్ళుగా బ్లాగులు చదువుతున్నాను.
ఎప్పటినుండో రాయాలని అనిపించినా ఎందుకో కుదరలేదు.
నిజం చెప్పాలంటే, కుదరలేదనడం కంటే ఎప్పుడూ ప్రయత్నించలేదనే చెప్పాలి.
ఇన్నేళ్ళ నా జీవితంలో ఎందరితోనో ఆత్మీయ పరిచయం... మరెన్నో మధుర స్మృతులు...
తలుచుకొంటేనే నవ్వొచ్చే విషయాలు, తలుచుకొని తలుచుకొని నవ్వుకొనే సంగతులు, పాటలు,
పాఠాలు, గుణపాఠాలు, ఆటలు, కొట్లాటలు, ఎన్నో, మరెన్నో....
అవన్నీ కాక పోయినా కొన్నైనా మరిచిపోకుండా అక్షరబధ్ధం చేసుకొని దాచుకోవాలనే ఈ నా చిన్ని  ప్రయత్నం.
ఈ బ్లాగ్ కేవలం నా జ్ఞాపకాలను పంచుకోవడానికే తప్ప మరే
ఇతర ఉద్దేశ్యాలు నాకు లేవు.
విజ్ఞానం పంచాలనో లేదా ఎవరినో ఎడ్యుకేట్  చేయాలనో, ఉద్ధరించేయాలనో, నన్ను నేను నిరూపించుకోవాలనో నాకస్సలు లేదు.
 వాదాలు, వివాదాలు , ఆశించి వస్తే మాత్రం ఆశాభంగం తప్పదు.
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలన్నారు పెద్దలు.
నొప్పింపక తా నొవ్వక  అని కూడా అన్నారు కదండీ!!!
మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలతో
శ్రీ