10, ఏప్రిల్ 2016, ఆదివారం

Excuse me lady! You're beautiful!



నేనేనండీ  ఆ beautiful lady ని.
ఆ beautiful lady వెనకున్న కధాకమామీషు ఏంటో తెలుసుకోవాలంటే ఇక చదివేయండి మరి.

1998. అప్పుడు మేం మా వారి ఉద్యోగరీత్యా లండన్ లో ఉండేవాళ్ళం. అదే మా మొదటి పరదేశవాసం. అన్నీ కొత్తే,  అన్నీ వింతే. కళ్ళు ఇంతింత చేసుకొని అలా చూస్తుండేదాన్ని.

మావారి అమ్మమ్మగారు అంటుండేవారంట, ఈజన్మలో
వస్త్రదానం చేయకపోతే, వచ్చే జన్మలో విదేశాలలో పుట్టి, వేసుకోవడానికి బట్టలు కరువౌతాయని. ఈ వీసా ప్రాబ్లమ్స్‌ అవీ లేకుండా ఈ షార్ట్‌ కట్ రూట్‌ ఏదో బావుందని వీళ్ళందరూ సంబరపడిపోయేవారనుకోండి!

కానీ ఆ విదేశంలో అందరూ కనీసం చేతి చిటికెనవేలు కూడా కనపడకుండా  చేతులకు గ్లౌజులు కూడా  వేసుకొని కనపడేవారు. ఆ శాపం ఈ దేశంవారికి వర్తించదేమో, ఎందుకంటే వీరికి ఇదే స్వదేశం కదా, అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ కొన్నిరోజుల తర్వాత అర్ధమైంది అది ఱుతుప్రభావమే కానీ దానప్రభావం కాదని.

ఒక్కదాన్నే ఇంట్లో బోర్ కొడుతుందని అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి కూర్చునేదాన్ని. అక్కడినుంచి
ఇంక అలా  సైట్‌సీయింగ్‌ కు వెళ్ళిపోయేవాళ్ళం.


ఒకరోజు తను 'మధ్యాన్నం కల్లా ఆఫీస్కు వచ్చేసెయ్యి. తొందరగా  సైట్‌సీయింగ్‌కు వెళదాం' అనడంతో
మధ్యాన్నం మూడు గంటలకు బయలుదేరాను. మా ఇంటినుండి వాళ్ళ ఆఫీస్ కు రెండు ట్రైన్లు
మారి వెళ్లాలి. నేను ట్రైన్ మారడానికి దిగిన స్టేషన్‌ ఏమో అండర్‌గ్రౌండ్‌.  ఆఫ్ పీక్ అవర్స్‌ కావడంతో
స్టేషన్‌ అంతా ఖాళీగా ఉంది. ఎక్కడో ప్లాట్‌ఫారం చివర ఒక ఆజానుబాహుడైన ఒక మనిషి దిగాడు.
అంతే, ఇంక ప్లాట్‌ఫారంఅంతా ఖాళీ. దాంతో వెంటనే గబగబా నడవడం మొదలుపెట్టాను.


నేను ఎక్కవలసిన ఇంకో  ట్రైన్ వేరే  ప్లాట్‌ఫారంకు వస్తుంది. బ్రిడ్జి క్రాస్‌ చేసి వెళ్ళాలి. నేను నడుస్తున్నాను. నా వెనకాలే  అడుగుల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూడకుండానే నడక కొంచం వేగం పెంచాను. వెంటనే నా వెనకే వస్తున్న ఆ అడుగుల వేగం కూడా పెరిగింది. ఈ సారి నడక
ఇంకా బాగా వేగం పెంచి, కొద్దిగా తల తిప్పి వెనక్కి చూశా.  నాతో పాటు ట్రైన్ దిగిన ఆ వ్యక్తి పెద్ద పెద్ద అంగలతో నా వెనకాలే వస్తూ ఏదో అంటున్నాడు.

"Excuse me lady!, Please stop!  You're beautiful!"
అంటూ ఇంకా ఏదో అంటున్నాడు.

ఇంకంతే!  విపరీతంగా భయపడిపోయాను. కాళ్లూచేతులూ వణికిపోతున్నా, ఎలాగో పరుగెత్తడం మెదలుపెట్టాను. ట్రైన్ సంగతి దేవుడెరుగు! ముందీ స్టేషన్‌ నుంచి బయటపడి,  జనాలుండే చోటికి వెళ్ళాలని నా ఆలోచన. ఓ పదడుగులు కూడా పరుగెత్తి ఉండను, ఆ వ్యక్తి  నాలుగంగల్లో  నన్ను చేరుకుని, నా ముందు నించోని, ఏంటో చెప్తున్నాడు. ఏం చేయాలో తెలీలేదు. వణికిపోతూ నించున్నాను. నాకళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి.

 "Are you ok? Is everything alright?" అనడం వినిపించడంతో, కళ్ళు తుడుచుకొని అతని వైపు సరిగ్గాచూశాను.
అతని చేతిలో నా దుపట్టా!!!

ట్రైన్‌ దిగి గబగబా నడుస్తున్నప్పుడు  ఎక్కడో జారి పడిపోయినట్టుంది. పాపం! అది నాకివ్వడంకోసం
నా  వెనకాలే వచ్చాడు. తప్పుగా అర్ధం చేసుకున్నందుకు ఎంతో సిగ్గుగా అనిపించింది.   పదేపదే sorryఇంకా చాలా thanks చెప్పి, నా దుపట్టా తీసుకొని బయలు దేరాను.

ఇంతకీ  పాపం అతనన్నది, "Excuse me lady! Please stop! Your beautiful scarf  fell down!", అని.  అది నాకు "Excuse me lady! Please stop! You're beautiful," లాగ వినపడటంతో, పూర్తిగా వినే  ప్రయత్నం చేయకుండానే నాకు తోచింది అర్ధం చేసుకుని, తప్పుగా ఊహించేసుకొని,  భయపడిపోయాను.  అతను మాత్రం "That's alright!", అంటూ నవ్వుకుంటూ  వెళ్ళిపోయాడు.

ఇప్పటికీ ఎప్పుడన్నా మెట్రో ఎక్కినప్పుడు ఈ సంగతి గుర్తొచ్చి నవ్వొస్తుంది.

ఇదండీ ఆ టైటిల్‌ వెనకాల కధ.

మా సైట్ సీయింగ్ విశేషాలు మరోసారి రాస్తానే!

4 కామెంట్‌లు:

  1. బ్యూటిఫుల్... లేడీ! మరి మిగిలిన కబుర్లు కూడా గబగబా చెప్పు మరీ! వీకెండ్ కదా - సరదాగా చదివేసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  2. తొందర తొందర గా రాయాలనే నాకూ ఉంది. ప్రయత్నిస్తున్నాను. తెలుగులో టైప్‌ చేయడం బాగా టైమ్‌ తీసుకొంటోంది.
    Thanks for your 'beautiful' comment.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రముఖ్ IME వాడటం పయత్నించండి. తెలుగులో సులభంగా వ్రాయగలరు. దాని లింక్: http://vishalon.net/PramukhIME/Windows.aspx

      తొలగించండి
  3. తప్పకుండా ప్రయత్నిస్తానండీ.
    శ్రమ తీసుకుని లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి