24, ఏప్రిల్ 2016, ఆదివారం

నా పేరు వెనక ఉన్న వినూత్నమైన కధ

నా పేరు వెనక ఉన్న వినూత్నమైన కధ తెలుసుకోవాలంటే కధలోకి దూకేయండి మరీ!


మా పేరెంట్స్‌ కు, వాళ్ళ పెళ్ళైన దాదాపు పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టక పోవడంతో ఇరువైపుల పెద్దలూ ఎడాపెడా వాళ్ళ వాళ్ళ ఆరాధ్య దైవాలకు  బిడ్డ పుడితే పేరు పెట్టుకుంటామని, ఇంకా ఏంటేంటో
మొక్కేసుకున్నారంట. ఆ తర్వాత మొదలైంది అసలు కధ. మా అన్నయ్య పుట్టాడు. వంశాంకురమనీ, వారసుడనీ  మా నాన్నగారి వైపు వారు పంతం పట్టి, ఎలాగైతే మా అన్నయ్యకు పేరు పెట్టేసుకున్నారు. అందరి మొక్కులూ తీరేలా ఓ చేంతాడంత పేరు పెట్టడానికి మా పేరెంట్స్‌ ససేమిరా అన్నారు. దాంతో మా అమ్మగారి వైపు  వాళ్ళ మొక్కులు తీరలేదు. దాంతో వాళ్ళు వాళ్ళ మొక్కులు చెల్లించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.


ఇక నేను పుట్టాను. (ఇక్కడ అక్కినేని గారి, ' నేను పుట్టాను' పాట బ్యాగ్గ్రౌండ్‌లో వస్తుంటుంది)
మళ్లీ అందరికీ వాళ్ళ వాళ్ళ మొక్కులు గుర్తుకొచ్చాయి. ఈసారి పేరు పెట్టి, మొక్కులు తీర్చుకునే అవకాశం, హక్కు మాదంటే మాదని ఇరు ప్రక్కల పెద్దలూ మళ్లీ మొదలెట్టారు. ఈ గోల భరించలేక కొన్ని రోజులు డిలే చేస్తే వాళ్ళలో ఎవరో ఒకరు తగ్గుతార్లే అని  మా పేరెంట్స్‌,  నా నామకరణం వాయిదా వేశారు. అది ఏ ముహూర్తం లో వాయిదా వేశారో గానీ అలా వాయిదా పడుతూనే ఉంది. ఎన్ని రోజులైనా ఇరుప్రక్కల పెద్దలూ ఇంచి కూడా తగ్గలేదు. ఎవరినీ నొప్పించడం ఇష్టం లేక కాలం మీద భారం వేసి మా వాళ్ళూ సైలెంట్ ఐపోయారు.  ఈలోగా నెలలు, సంవత్సరాలు గడిచాయి. నాకు నాలుగేళ్ళు నిండాయి. అయినా ఊహూ! ఎవరూ తగ్గలేదు. దాంతో ఇంకా అనామిక గానే మిగిలిపోయాను పాపం!



ఈలోగా మా అన్నయ్యను మా వీధి చివరలో ఉన్న బళ్ళో వేశారు. వాడు స్కూలుకెళ్ళడానికి తెగ మారాం
చేసేవాడంట. చాలా ఏడ్చేవాడంట. రోజూ బలవంతాన లాక్కెళ్ళి స్కూల్ లో దింపాల్సి వచ్చేదంట.
మా అమ్మ చెయ్యి పట్టుకుని లాక్కెళుతుంటే వాటర్ స్కీయింగ్ చేస్తున్నట్టు చేతికి  వేళ్ళాడుతుండేవాడంట. ఎలాగోలా లాక్కెళ్ళి స్కూల్‌  లో దించేసి వస్తే, మా అమ్మ ఇల్లు చేరేలోగా వీడు పరిగెట్టుకుని వచ్చేసి ఇంట్లో దాక్కునే వాడంట. ఒకసారి అలాగే మా అన్నయ్యను మళ్లీ లాక్కెళ్ళి ఎలాగో స్కూల్‌ లో దింపి ఇంటికి వచ్చి చూస్తే నేను కనపడలేదు.  అందరూ కంగారుపడి వెతకడం మొదలెట్టారంట. ఈ లోగా నేను మా అన్నయ్య
 క్లాసు లో కూర్చొని ఉన్నానని తెలిసి అందరూ 'హమ్మయ్య' అని ఊపిరి తీసుకున్నారు. ఇంతకీ ఏం
జరిగిందంటే...........



........మా అన్నయ్య, అమ్మ ఇలా స్కూలుకూ ఇంటికి,  తిరుగుతుంటే, నాలుగేళ్ళున్న నేను నా  అంత పొడవున్న మా అన్నయ్య పుస్తకాల సంచి భుజం మీంచి అట్నుంచి ఇటు వేసుకొని,  ఆ స్కూలుకెళ్ళి నా క్కనిపించిన క్లాసులో కూర్చున్నాన్నంట.  నేను స్కూల్లో ఉన్నానని తెలిసి మా అమ్మ తీసుకెళడానికి  వచ్చి రమ్మంటే రానని ఏడ్చానంట. "పోన్లెండి! చిన్నపిల్లను ఏడిపించడం ఎందుకు? సరదా పడుతోంది. కాసేపు కూర్చోనివ్వండి, ఏడ్చినపుడు ఇంటికి పంపిస్తాము. మీ అబ్బాయికి ఉన్నట్టు స్కూలంటే  భయం లేకుండా  పోతుంది,"  అని మాస్టారు గారు అంటే సరే నని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కూర్చోవడం కూర్చోవడం, స్కూలు అయ్యేవరకు కూర్చున్నానంట. ఇక నాతో పాటు మా అన్నయ్య కూడా కూర్చోవలసి వచ్చింది  పాపం.




మర్రోజు మళ్లీ పొద్దున్నే మా అన్నయ్య మా అమ్మ చేయి పట్టుకుని స్కూలుకెళ్ళడానికి  ఏడుస్తూ  రోడ్డుమీద
యధావిధిగా స్కీయింగ్ ప్రాక్టీసు చేస్తుంటే నేను మాత్రం మా అన్నయ్య సంచి భుజం మీద వేసుకొని
డింగు డింగుమని నడుచుకుంటూ వెళ్ళి క్లాసులో కూర్చున్నానంట.  ఇంటికి రమ్మంటే రానని ఏడుపు. మళ్ళీ సీన్ మామూలే. "కూర్చోనివ్వండి. ఎంత సేపు కూర్చుంటుంది? ఎన్ని రోజులు కూర్చుంటుంది? పాప కూర్చుంటే కనీసం వాళ్ళ అన్నయ్య కాసేపు కూర్చుంటాడు" అని మాస్టారు గారనడంతో 'నేనుంటే మాఅన్నయ్య కూడా ఏడవకుండా కూర్చుంటాడు. పన్లో పనిగా నాకూ రెండక్షరమ్ముక్కలొస్తాయని' మా అమ్మ ఆశ పడింది గానీ............



................రాబోయే ఉపదద్రవాన్ని ఏమాత్రం ఊహించలేదు పాపం. అదిగో! సరిగ్గా అక్కడే ఎవరికైనా
జీవితంలో ఒక ఐడెంటిటీ నిచ్చే పేరు, ఇంతమంది ఎన్నో మొక్కులు మొక్కుకుని,  మా హక్కంటే మా హక్కని
భీష్మించుకుని, ఎన్నో ప్లాన్లు వేసుకొని పెట్టాలనుకుంటున్న పేరు వీళ్ళందరి చేయి జారిపోయింది. ప్చ్‌!!!



ఇలా మా అన్నయ్య కంటే ఠంచనుగా, శ్రద్ధగా నేను  స్కూలుకెళ్తుంటే మా వాళ్ళు మురిసిపోతూ ఉండగా
నాకు స్కూల్‌ లో జాయిన్ చేసే అసలు వయసు వచ్చిందంట. సరే! నన్ను  తీసుకెళ్ళి ఫార్మల్‌ గా  జాయిన్ చేయబోతే, "ఇన్ని నెలలుగా స్కూల్ కు వస్తోంది. మీ అమ్మాయి అడ్మిషన్‌ ఫార్మాలిటీస్ అన్నీ ఎప్పుడో అయిపోయాయి" అన్నారంట ఆ మాస్టారు. "అదేంటీ?  దానికి ఇంకా పేరే పెట్టలేదు. ఆ పేరు కోసం ఇంట్లో రెండు వైపుల పెద్దవాళ్ళూ, ఢీ అంటే ఢీ  అంటుంటే  మీ అంతట మీరు రికార్డ్స్‌ లో ఏం పేరు
రాసేసుకున్నారు?" అని వీళ్ళు కంగారు పడుతూ అడిగితే  ఆయన చల్లగా చెప్పేరంట, ' అమ్మాయి చక్కగా
ఉందని ఫలానా పేరు రాసేసుకున్నాము'  అని, నాకు వాళ్ళు రిజిస్టర్‌ లో రాసుకున్న  పేరు రివీల్ చేశారంట.


"ఈ పేరేదో బానే ఉంది, రికార్డ్స్‌ లో రిజిస్టర్‌ అయిపోయింది, మార్చడానికి లేదని  చెప్తే ముఖ్యంగా ఈ
పెద్దవాళ్ళ పట్టుదలల తలనొప్పి ప్రాబ్లమ్‌ సాల్వ్‌ ఐపోతుందని" వీళ్ళూ  సంబరపడిపోయారు.  కానీ నా గురుంచి ఎవరూ ఆలోచించలేదు. అదిగో అలా నా పేరు మా వాళ్ళెవరి చేత్తోటి కాకుండా అలా ఎవరివల్లో, అత్యంత (అ)సాధారణ పరిస్ధితులలో  పెట్టబడింది. ఇన్నేళ్ళుగా నేను  ఆ పేరు తోనే చలామణి ఐపోవాల్సి వచ్చింది.  ఇంక ఆ పేరు తో నేను పడ్డ కష్టాలు మరోసారి.

కానీ మొన్న దుర్ముఖి నామ సంవత్సర ఉగాది రోజు, ఇక బ్లాగు వ్రాయాల్సిందే అని గాఠ్ఠిగా డిసైడ్‌ చేసేసుకుని అప్పటికప్పుడు నా pseudonym ' శ్రీ '  గా నాకు నేనే నామకరణం చేసేసుకున్నాను.  అలా రెండుసార్లూ  నా నామకరణ మహోత్సవం అలా హడావుడిగా,  ఏ హడావుడి లేకుండా జరిగిపోయిందన్నమాట.
ఇదండీ నా పేరు వెనక ఉన్న విచిత్రమైన కధ. ఇలాంటి వింత  కధ ఎవరి పేరు వెనకా ఉండదని నా ప్రగాఢ నమ్మకం.


మరి మీరేమంటారు???





9 కామెంట్‌లు:

  1. నీ పేరులో "నేమున్న"దన్నమాట ;)బావుంది.

    రిప్లయితొలగించండి
  2. బ్లాగ్ పేరు కూడా మహత్తరంగా ఉందండీ. Happy blogging. :)

    రిప్లయితొలగించండి
  3. లలితా! పేరులో'నేము'న్నది? అసలేమున్నది? అంతా మాయ.

    రిప్లయితొలగించండి
  4. @ 'కొత్తావకాయ' : నాకెంతో ఇష్టమైన కొత్తావకాయ కన్నా బాగుందంటారా?
    Have been an anonymous reader of your blog for long. Always enjoyed reading your posts. Love your inimitable style. Thanks for stopping by and for your wishes too.

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత25-04-16 10:01 PM

    ఈరోజే మీ బ్లాగు చూసాను. కొత్తగా మొదలెట్టి మంచి కబుర్లు చెబుతున్నారు. Happy Blogging

    రిప్లయితొలగించండి
  6. తెర తీయగరాదా అని అన్నావు కానీ నీ కబుర్లన్నీ ఆ తెర వెనకాలే వుంచేస్తే ఎలా - కొంచెం తరచుగా చెప్పు మరి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంచెం వ్యవధి తీసుకున్నాను. నిజమే. ఇకమీదట త్వరగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

      తొలగించండి
  7. మంచిబ్లాగుకే తెరతీసారూ. ఇంకేం, కానివ్వండి, కానివ్వండి. టపాలు టపటపా రానివ్వండి.

    రిప్లయితొలగించండి
  8. ఏదో చిన్న ప్రయత్నం. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ!

    రిప్లయితొలగించండి