3, జూన్ 2016, శుక్రవారం

రైలు ప్రయాణం - కొన్ని జ్ఞాపకాలు

ఎక్కడికైనా ప్రయాణం అంటేనే చిన్నప్పుడు మాకు బోల్డంత ఉత్సాహం వచ్చేసేది.ఇప్పుడు రెండు గంటల ప్రయాణం అంటేనే, పిల్లలు  'జర్నీ అంతసేపా??'  అని నీరసంగా అడిగి, రకరకాల గాడ్జెట్‌లూ, వాటి ఛార్జర్లూ , తతిమ్మా సరంజామా మాత్రం ఉత్సాహంగా సర్దేసుకుంటున్నారు. ఇంక కళ్ళు ఆ గాడ్జెట్‌ లకు అప్పగించి,  చెవులకు హెడ్ ఫోన్స్‌ తగిలించుకుని, వాళ్ళ లోకంలో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. ఈ గాడ్జెట్‌ల బెడద లేని మా చిన్నప్పటి రోజుల్లో ప్రయాణం అంటే, పిల్లలకు సర్దుకోవడానికి బట్టలు తప్ప పెద్దగా ఏం ఉండేవి కాదు.  పైగా ఆ బట్టలు సర్దే డిపార్ట్‌మెంట్ అమ్మదే కాబట్టి, ఆ పని కూడా ఉండేది కాదు.


ప్రయాణం అంటే నాకు దాదాపు ప్రతీ వేసవి సెలవలకీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడమే గుర్తుకు వస్తుంది. అదేదో ఆషామాషీ ప్రయాణం కాదు సుమండీ! ఈ రోజు ప్రొద్దున దాదాపు ఏడు గంటలకు ప.గోజి లోని మా ఊర్లో రైలెక్కితే, గుంటూరు లో ఓ రైలు మారి, మర్రోజు ప్రొద్దునే గుంటకల్ లో ఇంకో రైలెక్కి, మధ్యాన్నం అనంతపురం లో దిగి బస్సెక్కితే సాయంకాలానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరేవాళ్ళం. మధ్య లో క్రాసింగ్ అనో లేదా  ఇంకేవైనా కారణాలతో కనెక్టింగ్ రైలు మిస్ అయ్యామంటే, రాత్రయ్యేది ఇంటికి చేరేటప్పటికి.


ఇక ప్రయాణానికి బట్టలు సర్దుకోవడం చిన్న పని. అంతకంటే ముందు, వెళ్ళగానే, ఏం తెచ్చారంటూ చుట్టూచేరే పిల్లలకు చిరుతిండ్లు  తయారు చేయించడం అత్యంత ముఖ్యమైన పని.  దారిలో నెమరు  వేయడానికి  మాక్కూడా అవసరమే అవి.  ఎవరన్నా వంటవాళ్ళనో,  లేకపోతే మిఠాయికొట్టు వాళ్ళకో పురమాయించి మా అమ్మ ఓ మూడు రకాలు స్వీట్లు  , ఓ మూడు రకాలు హాట్లు తయారు చేయించేది.  మిఠాయి ఉండలు, తొక్కుడు లడ్డూలు, కొబ్బరి లౌజులు, కోవా, బూందీ మిక్స్‌చర్, ఆకుపకోడీ, జంతికలు లాంటివి  . మిఠాయి ఉండలు అంటే బెల్లం పాకంలో బూందీ వేసి ఉండలు గా చుట్టేవి.ఇవి గానీ, పాకం బాగా కుదిరితే, గాఠ్ఠిగాఉండి, దంత సౌష్టవానికి పరీక్ష పెట్టేవి.


అసలు రైలు ప్రయాణం లో అత్యంత ముఖ్యమైన ఘట్టం 'విండో సీట్‌' సంపాయించడం.  మేం ముగ్గురు పిల్లలం కావడంతో, మా ఐదుమందికీ రిజర్వేషన్ లో వచ్చే రెండే రెండు విండో సీట్‌ లతో మా యుద్ధకాండ మొదలయ్యేది. మా తమ్ముడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు,  'పాపం చిన్నపిల్లాడు' అని అమ్మ కోటా లో వాడికి విండో సీట్‌ రిజర్వ్‌ ఐపోయేది. ఇంక మిగిలిన విండో సీట్‌ కోసం నేను, మా అన్నయ్య పోటీ పడేవాళ్ళం. వచ్చేమూడు స్టేషన్ల వరకు నీకు, ఆ తర్వాత మూడు స్టేషన్ల వరకు విండో సీట్‌ నాకని పంచుకుని సంధి చేసుకునే వాళ్ళం. మా ప్రక్క బెర్త్‌ లలో ఉన్నవాళ్ళకు పిల్లలు లేకపోతే, వాళ్ళు విండో సీట్‌ పాపం త్యాగం చేసి ఇచ్చేవారు. ఇక అప్పుడు చూడాలి....ఆ మొహం, ప్రపంచాన్ని జయించినంతగా,  విజయగర్వం తో వెలిగిపోయేది.



కళ్ళల్లో పడే నలకలు రుద్దుకుంటూ, కిటికీ ఊచల్లోంచి తల దూరి బైటకు వెళ్ళిపోయిందా అన్నంతగా తల ఆ ఊచలకు ఆనించి, గాలి మొహానికి గట్టిగా తాకుతుంటే , జుట్టురేగుతుంటే, కళ్ళు చికిలిస్తూ  అలా బైటకు చూస్తూ ఉండటం ఇప్పటికీ వసివాడని జ్ఞాపకం. ఆ రైలు ఊపేదానికన్నా ఎక్కువగా ఊగేవాళ్ళం. ఎంతగా అంటే, మర్రోజు రైలు దిగాక కూడా  ఇంకో రెండ్రోజులపాటు రైల్లో ఊగుతూ కూర్చున్నట్లే ఉండేది. అసలు ఆ రూట్లో వచ్చే స్టేషన్‌ల పేర్లన్నీ దాదాపుగా  కంఠతా వచ్చేవి. ఇంక అర్ధరాత్రిపూట చీకట్లో వచ్చే నల్లమల ఫారెస్టు  .  కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించేది కాదు. ఐనా సరే కిటికీ దగ్గర కూర్చోవాల్సిందే, బైటకు చూడాల్సిందే. ఆ రూట్లో ఎన్నో టన్నెల్స్‌ వచ్చేవి. ఇప్పటి పరిస్ధితి తెలీదు కానీ, అప్పట్లో  నల్లమల అడవులు బాగా దట్టంగా ఉండేవి.   ఆ చీకట్లోకి  టార్చ్‌లైట్‌ వేసుకుని అడవి జంతువులేమైనా కనిపిస్తాయేమోనని చూడటం ఇంకో సరదా జ్ఞాపకం.  అసలు ఏ జంతువులూ కనపడకపోయినా, ప్రొద్దున్నే లేచి, ఏవేవో జంతువులను చూశానని కోతలు కోసి, వాళ్ళ దిగాలు  మొహం చూసి ప్రక్కకు తిరిగి నవ్వుకోవడం. భలే ఉండేది.  మర్రోజు ప్రొద్దున్నే అడవిలో, చెట్టునే  పండిన ఈతకాయలు, జామకాయలు, కొన్నిసార్లు మామిడికాయలు,సీతాఫలాలు రైల్లో అమ్మడానికి వచ్చేవి. ఎంత రుచిగా ఉండేవో.



రైలు ఎక్కడానికి ముందే లేదా ఎక్కగానే మా డాడీ చేసే మొదటి పని వీలైనన్ని న్యూస్ పేపర్లు కొనడం.  డాడీ చదివేశాక, మేం ( ఇంగ్లీషు పేపర్లు)   చదివినట్లు  నటించేశాక, ఆ పేపర్లతో బోలెడు ఉపయోగాలు.............ఆ స్వీట్లు  వగైరాలు తినడానికి, బెర్త్ లు శుభ్రం చేసుకోవడానికి, రాత్రి భోజనాలు చేసేటప్పుడు క్యారియర్ క్రింద పరవడానికి, మా ప్లేట్ల క్రిందికి, ఆ తర్వాత మళ్ళీ బెర్త్‌ లు శుభ్రం చేసుకోవడానికి.  రైల్లో  భోజనం అంటేనే గుంటూరు గీతాకేఫ్ గుర్తొస్తుంది.  ఆ కూరలు ఎంత బావుండేవో.  అక్కడి సాంబారు మరీను.  ఇంట్లో అమ్మ చేసిన ప్రతీ కూరకు వంద వంకలు పెట్టే మేము, అదేంటో కిక్కురుమనకుండా అన్ని కూరలు  తినేసేవాళ్ళం. అందుకే అమ్మ,  పులిహోర లేదా పెరుగన్నం పట్టుకెళదామన్నా వద్దంటేవద్దని, గీతాకేఫ్ కెళదామని గొడవ చేసేవాళ్ళం.


గుంటూరు చేరేటప్పటికి మధ్యాన్నం ఒంటిగంటయ్యేది. వెంటనే లగేజి  వెయిటింగ్ రూమ్ లో పెట్టేసి ఖాళీ క్యారియర్ తీసుకుని గీతాకేఫ్ కి వెళ్ళి భోజనం చేసేసి క్యారియర్ లో రాత్రి కి భోజనాలు ప్యాక్ చేయించుకున్నాక,  దగ్గరలో ఉండే విశాలాంధ్ర కు వెళ్ళాల్సిందే.  అక్కడ గబగబా చదివినన్ని చదివేసి,  మాకు కావలసినన్ని పుస్తకాలు కొనుక్కుని తిరిగి వెయిటింగ్ రూమ్ కు వచ్చేవాళ్ళం. అక్కడ ఉండే ఇన్‌ఛార్జి  మామ్మగారు సామాను భద్రంగా చూస్తుండేవారు.  నాకు జ్ఞాపకం ఉన్నప్పటి నుండీ ఆ మామ్మగారు ఆ వెయిటింగ్ రూమ్‌ ఇన్‌ఛార్జి గా ఉండేవారు. ఆమెతో పాటు ఇంకో ఆమె కూడా ఉండేవారు. ఆమె చాలా పొట్టిగా ఓ ఏడేళ్ళ వయసు పిల్లలంత ఎత్తు మాత్రం ఉండేవారు. ఇద్దరూ కలిసి వైరు బుట్టలు అల్లుతుండేవారు. వాళ్ళకు కాలక్షేపం, ఇంకా కొంచెం ఆదాయం. మా అమ్మ రకరకాల సైజుల్లో వాళ్ళ తో బుట్టలు అల్లించుకుంది. వెళ్ళేటప్పుడు చెప్తే, ఐదారు వారాల తర్వాత తిరుగు ప్రయాణం లో వచ్చేటప్పటికి అల్లేసి ఉండేవాళ్ళు. సంవత్సరానికి రెండుసార్లే  చూసినా భలేగా గుర్తు పెట్టుకునేవారు.



' రైల్వే టైమ్ టేబుల్' అనబడే పుస్తకం అంటూ ఒకటుంటుందని ఇప్పటి గూగుల్  జనరేషన్ కు తెలియక పోవచ్చు గానీ చిన్నప్పుడు మా క్కూడా ఆ టైమ్ టేబుల్ చూడ్డం వచ్చేది. ఆ ప్రక్క బెర్త్ ల వాళ్ళకు గానీ అది చూడ్డం రాకపోతే ఇంక  మా  ఫోజులకు అంతే ఉండేది కాదు. అసలు ఆ ప్రక్క బెర్త్ ల వాళ్ళతో ఆ కాస్త సమయం లోనే ఎంత పరిచయం అయిపోయేదో తలుచుకుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. 'ఎక్కడి దాకా' తో మొదలెట్టిన మాటలు , స్టేషన్లు వెనక్కెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం ముందుకెళ్తూ  వాళ్ళు దిగాల్సిన స్టేషన్‌  వచ్చేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోయేవి. ఆ కాసేపట్లోనే 'అత్తయ్యగారూ, మామయ్యగారూ' అని వరసలు కలిసిపోయేవి. వాళ్ళు దిగిపోతుంటే బాగా కావల్సినవారు దూరం అయిపోతున్నట్టు మనసు భారంగా అయిపోయేది. ఇప్పటి ప్రయాణాలలో  వేగం, సౌకర్యాలు పెరిగాయేమో గానీ ఎప్పటికీ నా మనసులో, నా జ్ఞాపకాలలో ప్రయాణం అంటే అప్పటి రైలు ప్రయాణమే. ఇంకేం దానికి సాటి రాదు, రావు. అంతే.

8 కామెంట్‌లు:

  1. నీతో పాటు నేనూ చేసేశాను - రైలు ప్రయాణం.

    చా...లా - అంటే నువ్వెక్కిన రైలు పొడవు కన్నా ఇంకా ఎక్కువగా బావుంది ఈ పోస్ట్ - చప్పట్లు అందుకో మరి !!!

    గుంటూరు విశాలాంధ్రని గుర్తు చేసినందుకు మరిన్ని చప్పట్లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఔనా! Thank you. నాతో వచ్చినందుకు, నీకు నచ్చినందుకు, నువ్వు మెచ్చినందుకు. :)
      గుంటూరు, గీతా కేఫ్, విశాలాంధ్ర ....... ఎప్పటికీ నా ఫేవరెట్‌లే.

      తొలగించండి
  2. మీ పిల్లల సెలవలు దగ్గరకి వచ్చేసరికి మీకు మీ సెలవలు గుర్తోచ్చుంటాయి.చూసారా మీ రైలు ప్రయాణం లో తెలీకుండానే మేము అందరమూ రైలు ఎక్కేసాము. Gadgets ఏమి లేని ఆ రోజుల్లో ఆటలకి 24 గంటలు సరిపోయేవి కాదు అదేంటో. రైల్వే టైం టేబుల్ గురించి ఈ తరం వారికి తెలిసే అవకాశమే లేదు అన్ని నెట్ లో ఉంటున్నాయి కదా. మీరు చెప్పినట్లు ఆ స్టేషన్ల పేర్లన్నీ బట్టీ వచ్చేసేవి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా జ్ఞాపకాలలోకి నాతో పాటు ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు చంద్రిక గారూ!
      కానీ నిజం చెప్పాలంటే ఈ పోస్ట్‌ కు ప్రేరణ మాత్రం మీ బ్లాగు లోని 'చెరగని తరగని జ్ఞాపకాలు' అనే పోస్ట్. అదే సంగతి నా కమెంట్ లో మెన్షన్ చేశాను కూడా.
      ఇక్కడ మాకు ఇప్పుడు వింటర్ మొదలైందండి. పిల్లలకు శలవలకు ఇంకా చాలా టైముంది. :)

      తొలగించండి
  3. Hammayya thera theesesaa chaalaa varakuu chadivesaa.. chaalaa baagundi... inkaa chaalaa wraayaalani manaspoorthigaa korukuntunnaa

    రిప్లయితొలగించండి
  4. వీలు చూసుకుని నా బ్లాగు ను చదివి స్పందించినందుకు, ఇంకా మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ఎన్నెలగారూ!

    రిప్లయితొలగించండి