12, ఏప్రిల్ 2016, మంగళవారం
మా సైట్ సీయింగ్ ప్రహసనం
మా సైట్ సీయింగ్ ప్రహసనాన్ని అవధరించండి మరి.
లండన్ వెళ్ళిన క్రొత్తలో మాకు కారు లేక పోవడంతో లోకల్ ట్రైన్ లేదా బస్సు లో తిరిగేవాళ్ళం. మొట్టమొదట సారి గా సైట్ సీయింగ్ కు వెళ్ళినపుడు టూరిస్టుల సౌలభ్యం కోసం నడిచే, 'బిగ్ బెన్' కంపెనీ వారి 'హాప్ ఆన్, హాప్ ఆఫ్' బస్సు ఎక్కాం. ఆ టికెట్ కొంటే ఆ రోజంతా ఆ కంపెనీ వారి ఏ బస్ అయినా, ఏ స్టాప్ లో అయినా ఎక్కచ్చు, దిగచ్చు.
అది డబల్ డెకర్ బస్సు. పైన ఓపెన్ టాప్ ఏరియా లో కూర్చుందామని మెట్లు ఎక్కుతుంటే, నీట్ గా ఇన్‌షర్ట్ చేసుకుని, ఎడమ చేతిలో కొన్ని హెడ్‌ఫోన్ సెట్లు పట్టుకొన్న ఓ యువకుడు, కుడిచేతిలో ఓ హెడ్ ఫోన్ సెట్ పట్టుకొని, చిరునవ్వు తో, "వుడ్ యు లైక్ టు హావ్ ఎ హెడ్ ఫోన్ సెట్ సర్?" అని ఎంతో మర్యాదగా మావారిని అడిగాడు. దానికి ఈయన చెయ్యి, తల అడ్డంగా ఊపుతూ, "నో, ధాంక్స్" అని ఆ అబ్బాయికి చెప్పి, వెనక వస్తున్న నా వైపుకు తిరిగి, లోగొంతుక తో "ఇండియా లోలాగానే, ఇక్కడ కూడా బస్సుల్లోనూ, రైళ్ళలోనూ అవీఇవీ అమ్ముకునే వాళ్ళుంటారు. వాటి క్వాలిటీ ఏం బాగోదు. నువ్వు అలాంటివి ఏవీ తొందరపడి తీసుకోవద్దు" అన్నారు.
నేను అలాగే అని బుద్ధిగా తల ఊపి, తల ఇంకోవైపుకు తిప్పేసుకుని, ఆ అబ్బాయి ఏం చెప్పేది వినకుండా, గబగబా మెట్లు ఎక్కేసి తన ప్రక్కనే కూర్చున్నా. దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయున్నాయి. మాది లాస్ట్ సీట్. బస్సు లండన్ రోడ్లలో నెమ్మదిగా వెళుతోంది. కొన్ని బిల్డింగ్ ల దగ్గర కొద్దిసేపు ఆగి మళ్లీ
బయలుదేరుతోంది
కొంచెం సేపయిన తర్వాత మేం గమనించినదేమిటంటే, మా ముందున్న అందరూ, కీ ఇచ్చిన మరబొమ్మల్లా అందరూ ఒక్కసారే కుడివైపుకు, మళ్లీ కొంచెంసేపు ఐన తరువాత ఎడమవైపుకు తిరిగి
చూస్తున్నారు. వెంటనే ఏం అర్ధం కాలేదు. కొన్ని సెకన్ల తరువాత వెలిగింది, వాళ్ళందరూ హెడ్‌ఫోన్లు
పెట్టుకొని ఉన్నారనిన్నీ, దాన్లోంచి ఆ లాండ్‌మార్క్ బిల్డింగ్ ల గురించిన రన్నింగ్ కామెంటరీ వింటున్నారనిన్నీ, మాకు పాపం ఆ అబ్బాయి హెడ్‌ఫోన్ అమ్మచూపలేదనిన్నీ, కేవలం ఇవ్వచూపాడనిన్నీ,
మేము ఏదేదో ఊహించేసుకొని ఆ హెడ్ ఫోన్ తృణీకరించామనిన్నీ వగైరా వగైరా!
అయిందేదో అయింది, మళ్లీ ఆ అబ్బాయినడిగి రెండు హెడ్‌ఫోన్ సెట్లు తెమ్మంటే ఈయనకు అహం అడ్డొచ్చింది. 'ఈ మూకీ సినిమా నేను చూడను, ముందెళ్ళి తెస్తారా లేదా'. అన్నా కదలకుండా కూర్చున్నారు.
ఇలా కాదని నేను కిందకెళితే, నన్ను చూడగానే ఆ అబ్బాయి రెండు హెడ్‌ఫోన్ సెట్లు చేతిలో పెట్టాడు.
నాకు మాత్రమే తెచ్చుకుందామని అనిపించినా పోన్లే పాపం అని రెండూ పట్టుకొచ్చాను. ఇంక మేం కూడా అందరితో పాటు అటూఇటూ తల తిప్పి చూడటం మొదలు పెట్టాం.
అంతలో మేడమ్ టుసాడ్ వాక్స్ మ్యూజియం వాక్స్ మ్యాజియం స్టాప్ వచ్చింది. అది చూడాలనుకొని అక్కడ దిగి, టికెట్ కొనుక్కుని క్యూ లో నించున్నాం. క్యూ నెమ్మదిగా కదులుతోంది. కొద్ది సేపట్లోనే
మైన్ డోర్ దగ్గరకు వచ్చేశాం. లోపలికి ఎంటరవ్వగానే కుడిచేతిప్రక్క ఒక పోలీసాఫీసర్ టికెట్ చెకింగ్ కోసం చెయ్యిచాపి నించున్నాడు. టికెట్స్ చూపిస్తే ఎంతకీ తీసుకోడే! కొన్ని సెకన్ల తర్వాత వెలిగింది, అదికూడా ఓ వాక్స్ బొమ్మే అని. కాకపోతే మాలాగే అందరూ చేయబోవడం కొంతలో కొంత ఓదార్పు. ఆ మ్యూజియం లోప్రపంచంలోని ముఖ్యనాయకులు, మేటి క్రీడాకారులు, హాలీవుడ్ స్టార్లు , బ్రిటిష్ రాయల్ ఫామిలీతో సహా
ఇంకా ఎందరివో లైఫ్ లైక్ బొమ్మలున్నాయి. అక్కడ గుర్తు పట్టగలిగిన వాళ్ళందరి వాక్స్ బొమ్మలతోనూ
ఫోటోలు తీసేసుకున్నాం. అప్పటికి అక్కడ కేవలం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వి తప్ప
మరే ఇతర ఇండియన్స్ బొమ్మలూ లేవు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళ బొమ్మలు అంత బాలేవు.
ఆ తర్వాత ఇక ఆ రోజుకు చాలించి ఇంటికి వెళ్ళిపోయాము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ సైట్ సీయింగ్ ప్రహసనం బావుంది. Thanks for sharing.
రిప్లయితొలగించండినిజంగా ప్రహసనమే అది. Thank you.
తొలగించండిమొదట ఏదో ఊహించేసుకోవటం, తర్వాత ఇగోతో సరిదిద్దుకోలేక బాధపడటం నాకూ అలవాటే. ఎంత వదిలించుకోవాలనుకున్నా కొన్ని వదలవంతే.
రిప్లయితొలగించండిఅనుభవరాహిత్యం, అతి జాగ్రత్త, మీరన్నట్టు ఏదో ఊహించేసుకోవటం వెరసి ఇలాంటి అనుభవాలు. కానీ గుర్తొచ్చినప్పుడు పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుందంతే!
రిప్లయితొలగించండిధన్యవాదాలు మీ కామెంటుకు.