నా పేరు వెనక ఉన్న వినూత్నమైన కధ తెలుసుకోవాలంటే కధలోకి దూకేయండి మరీ!
మా పేరెంట్స్ కు, వాళ్ళ పెళ్ళైన దాదాపు పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టక పోవడంతో ఇరువైపుల పెద్దలూ ఎడాపెడా వాళ్ళ వాళ్ళ ఆరాధ్య దైవాలకు బిడ్డ పుడితే పేరు పెట్టుకుంటామని, ఇంకా ఏంటేంటో
మొక్కేసుకున్నారంట. ఆ తర్వాత మొదలైంది అసలు కధ. మా అన్నయ్య పుట్టాడు. వంశాంకురమనీ, వారసుడనీ మా నాన్నగారి వైపు వారు పంతం పట్టి, ఎలాగైతే మా అన్నయ్యకు పేరు పెట్టేసుకున్నారు. అందరి మొక్కులూ తీరేలా ఓ చేంతాడంత పేరు పెట్టడానికి మా పేరెంట్స్ ససేమిరా అన్నారు. దాంతో మా అమ్మగారి వైపు వాళ్ళ మొక్కులు తీరలేదు. దాంతో వాళ్ళు వాళ్ళ మొక్కులు చెల్లించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక నేను పుట్టాను. (ఇక్కడ అక్కినేని గారి, ' నేను పుట్టాను' పాట బ్యాగ్గ్రౌండ్‌లో వస్తుంటుంది)
మళ్లీ అందరికీ వాళ్ళ వాళ్ళ మొక్కులు గుర్తుకొచ్చాయి. ఈసారి పేరు పెట్టి, మొక్కులు తీర్చుకునే అవకాశం, హక్కు మాదంటే మాదని ఇరు ప్రక్కల పెద్దలూ మళ్లీ మొదలెట్టారు. ఈ గోల భరించలేక కొన్ని రోజులు డిలే చేస్తే వాళ్ళలో ఎవరో ఒకరు తగ్గుతార్లే అని మా పేరెంట్స్, నా నామకరణం వాయిదా వేశారు. అది ఏ ముహూర్తం లో వాయిదా వేశారో గానీ అలా వాయిదా పడుతూనే ఉంది. ఎన్ని రోజులైనా ఇరుప్రక్కల పెద్దలూ ఇంచి కూడా తగ్గలేదు. ఎవరినీ నొప్పించడం ఇష్టం లేక కాలం మీద భారం వేసి మా వాళ్ళూ సైలెంట్ ఐపోయారు. ఈలోగా నెలలు, సంవత్సరాలు గడిచాయి. నాకు నాలుగేళ్ళు నిండాయి. అయినా ఊహూ! ఎవరూ తగ్గలేదు. దాంతో ఇంకా అనామిక గానే మిగిలిపోయాను పాపం!
ఈలోగా మా అన్నయ్యను మా వీధి చివరలో ఉన్న బళ్ళో వేశారు. వాడు స్కూలుకెళ్ళడానికి తెగ మారాం
చేసేవాడంట. చాలా ఏడ్చేవాడంట. రోజూ బలవంతాన లాక్కెళ్ళి స్కూల్ లో దింపాల్సి వచ్చేదంట.
మా అమ్మ చెయ్యి పట్టుకుని లాక్కెళుతుంటే వాటర్ స్కీయింగ్ చేస్తున్నట్టు చేతికి వేళ్ళాడుతుండేవాడంట. ఎలాగోలా లాక్కెళ్ళి స్కూల్ లో దించేసి వస్తే, మా అమ్మ ఇల్లు చేరేలోగా వీడు పరిగెట్టుకుని వచ్చేసి ఇంట్లో దాక్కునే వాడంట. ఒకసారి అలాగే మా అన్నయ్యను మళ్లీ లాక్కెళ్ళి ఎలాగో స్కూల్ లో దింపి ఇంటికి వచ్చి చూస్తే నేను కనపడలేదు. అందరూ కంగారుపడి వెతకడం మొదలెట్టారంట. ఈ లోగా నేను మా అన్నయ్య
క్లాసు లో కూర్చొని ఉన్నానని తెలిసి అందరూ 'హమ్మయ్య' అని ఊపిరి తీసుకున్నారు. ఇంతకీ ఏం
జరిగిందంటే...........
........మా అన్నయ్య, అమ్మ ఇలా స్కూలుకూ ఇంటికి, తిరుగుతుంటే, నాలుగేళ్ళున్న నేను నా అంత పొడవున్న మా అన్నయ్య పుస్తకాల సంచి భుజం మీంచి అట్నుంచి ఇటు వేసుకొని, ఆ స్కూలుకెళ్ళి నా క్కనిపించిన క్లాసులో కూర్చున్నాన్నంట. నేను స్కూల్లో ఉన్నానని తెలిసి మా అమ్మ తీసుకెళడానికి వచ్చి రమ్మంటే రానని ఏడ్చానంట. "పోన్లెండి! చిన్నపిల్లను ఏడిపించడం ఎందుకు? సరదా పడుతోంది. కాసేపు కూర్చోనివ్వండి, ఏడ్చినపుడు ఇంటికి పంపిస్తాము. మీ అబ్బాయికి ఉన్నట్టు స్కూలంటే భయం లేకుండా పోతుంది," అని మాస్టారు గారు అంటే సరే నని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కూర్చోవడం కూర్చోవడం, స్కూలు అయ్యేవరకు కూర్చున్నానంట. ఇక నాతో పాటు మా అన్నయ్య కూడా కూర్చోవలసి వచ్చింది పాపం.
మర్రోజు మళ్లీ పొద్దున్నే మా అన్నయ్య మా అమ్మ చేయి పట్టుకుని స్కూలుకెళ్ళడానికి ఏడుస్తూ రోడ్డుమీద
యధావిధిగా స్కీయింగ్ ప్రాక్టీసు చేస్తుంటే నేను మాత్రం మా అన్నయ్య సంచి భుజం మీద వేసుకొని
డింగు డింగుమని నడుచుకుంటూ వెళ్ళి క్లాసులో కూర్చున్నానంట. ఇంటికి రమ్మంటే రానని ఏడుపు. మళ్ళీ సీన్ మామూలే. "కూర్చోనివ్వండి. ఎంత సేపు కూర్చుంటుంది? ఎన్ని రోజులు కూర్చుంటుంది? పాప కూర్చుంటే కనీసం వాళ్ళ అన్నయ్య కాసేపు కూర్చుంటాడు" అని మాస్టారు గారనడంతో 'నేనుంటే మాఅన్నయ్య కూడా ఏడవకుండా కూర్చుంటాడు. పన్లో పనిగా నాకూ రెండక్షరమ్ముక్కలొస్తాయని' మా అమ్మ ఆశ పడింది గానీ............
................రాబోయే ఉపదద్రవాన్ని ఏమాత్రం ఊహించలేదు పాపం. అదిగో! సరిగ్గా అక్కడే ఎవరికైనా
జీవితంలో ఒక ఐడెంటిటీ నిచ్చే పేరు, ఇంతమంది ఎన్నో మొక్కులు మొక్కుకుని, మా హక్కంటే మా హక్కని
భీష్మించుకుని, ఎన్నో ప్లాన్లు వేసుకొని పెట్టాలనుకుంటున్న పేరు వీళ్ళందరి చేయి జారిపోయింది. ప్చ్!!!
ఇలా మా అన్నయ్య కంటే ఠంచనుగా, శ్రద్ధగా నేను స్కూలుకెళ్తుంటే మా వాళ్ళు మురిసిపోతూ ఉండగా
నాకు స్కూల్ లో జాయిన్ చేసే అసలు వయసు వచ్చిందంట. సరే! నన్ను తీసుకెళ్ళి ఫార్మల్ గా జాయిన్ చేయబోతే, "ఇన్ని నెలలుగా స్కూల్ కు వస్తోంది. మీ అమ్మాయి అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్నీ ఎప్పుడో అయిపోయాయి" అన్నారంట ఆ మాస్టారు. "అదేంటీ? దానికి ఇంకా పేరే పెట్టలేదు. ఆ పేరు కోసం ఇంట్లో రెండు వైపుల పెద్దవాళ్ళూ, ఢీ అంటే ఢీ అంటుంటే మీ అంతట మీరు రికార్డ్స్ లో ఏం పేరు
రాసేసుకున్నారు?" అని వీళ్ళు కంగారు పడుతూ అడిగితే ఆయన చల్లగా చెప్పేరంట, ' అమ్మాయి చక్కగా
ఉందని ఫలానా పేరు రాసేసుకున్నాము' అని, నాకు వాళ్ళు రిజిస్టర్ లో రాసుకున్న పేరు రివీల్ చేశారంట.
"ఈ పేరేదో బానే ఉంది, రికార్డ్స్ లో రిజిస్టర్ అయిపోయింది, మార్చడానికి లేదని చెప్తే ముఖ్యంగా ఈ
పెద్దవాళ్ళ పట్టుదలల తలనొప్పి ప్రాబ్లమ్ సాల్వ్ ఐపోతుందని" వీళ్ళూ సంబరపడిపోయారు. కానీ నా గురుంచి ఎవరూ ఆలోచించలేదు. అదిగో అలా నా పేరు మా వాళ్ళెవరి చేత్తోటి కాకుండా అలా ఎవరివల్లో, అత్యంత (అ)సాధారణ పరిస్ధితులలో పెట్టబడింది. ఇన్నేళ్ళుగా నేను ఆ పేరు తోనే చలామణి ఐపోవాల్సి వచ్చింది. ఇంక ఆ పేరు తో నేను పడ్డ కష్టాలు మరోసారి.
కానీ మొన్న దుర్ముఖి నామ సంవత్సర ఉగాది రోజు, ఇక బ్లాగు వ్రాయాల్సిందే అని గాఠ్ఠిగా డిసైడ్ చేసేసుకుని అప్పటికప్పుడు నా pseudonym ' శ్రీ ' గా నాకు నేనే నామకరణం చేసేసుకున్నాను. అలా రెండుసార్లూ నా నామకరణ మహోత్సవం అలా హడావుడిగా, ఏ హడావుడి లేకుండా జరిగిపోయిందన్నమాట.
ఇదండీ నా పేరు వెనక ఉన్న విచిత్రమైన కధ. ఇలాంటి వింత కధ ఎవరి పేరు వెనకా ఉండదని నా ప్రగాఢ నమ్మకం.
మరి మీరేమంటారు???
24, ఏప్రిల్ 2016, ఆదివారం
21, ఏప్రిల్ 2016, గురువారం
'బ్రూస్ లీ డైలాగ్' లంటే ఏంటంటే....
మీ కందరికీ ఇంగ్లీషు లో 'టు రీడ్ ఇన్ బిట్‌వీన్ ద లైన్స్' అన్న సంగతి తెలిసే ఉంటుంది. అదిగో ఆ నైపుణ్యం నాకు చిన్నప్పటినుండీ కొంచం తక్కువే. ఎవరైనా హింట్ ఇచ్చినా పట్టుకోలేక పోయేదాన్ని. ఇప్పటికీ ఆ విషయంలో పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ లేదనుకోండి. అలాంటి సందర్భాలలో ఒకటి మీ కోసం.
నా చిన్నప్పుడు మా అన్నయ్య, తమ్ముడి వల్ల మార్షల్ ఆర్ట్స్ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. షావొలిన్ టెంపుల్ సిరీస్, బ్రూస్‌లీ సినిమాలు వగైరాలన్నమాట. అలా చూసి చూసి, బ్రూస్‌లీ కి పెద్ద ఫాన్ అయిపోయాను. గ్యాప్ ఇవ్వకుండా అలా ఎడా పెడా తన్నడం భలే నచ్చేది నాకు. కానీ మధ్యలో ఎందుకో ఆ సినిమాలు చూడ్డం కొంచం గ్యాప్ వచ్చింది.
అప్పుడు మేం వేసవి శెలవులకు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాం. అవి వీడియో క్యాసెట్ రోజులు. పిల్లలనందరినీ మధ్యాన్నం పూట ఇంట్లోనే ఉండేలా చేయడానికి రోజూ ఓ రెండు క్యాసెట్లు అద్దెకు తెచ్చేవారు. ఆ రోజు మా పెద్ద మావయ్య మాకిష్టమని బ్రూస్‌లీ సినిమా క్యాసెట్ తీసుకొచ్చాడు. బ్రూస్ లీ సినిమా అని నేను గెంతుకుంటూ వెళ్ళి కూర్చున్నాను. ఆ ఊళ్ళోనే ఉండే మా దూరపు బంధువుల అబ్బాయి అదే టైం లో మా ఇంటికి వచ్చాడు. తను కూడా సినిమా చూట్టానికి కూర్చున్నాడు. ఆ అబ్బాయి అప్పట్లో కరాటే నేర్చుకొంటుండేవాడంట. తనను తాను బ్రూస్ లీ లెవెల్ లో ఊహించుకునేవాడంట. మనకు ఈ డీటైల్స్ ఏవీ తెలీవు. సినిమా మొదలైంది. బ్రూస్ లీ టీవీ మీద కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసి పోతున్నాడు. అది గమనించి మా మావయ్య ఇంకాస్త ఎగేస్తున్నాడు, " అరే! నువ్వచ్చం బ్రూస్ లీ లాగే ఉన్నావురా" అని. ఆ అబ్బాయి ఇంకా మురిసిపోతున్నాడు. మా మావయ్య మరింత ఎగేస్తున్నాడు. కానీ అదేదీ నా తలకెక్కడం లేదు. అసలేదీ గమనించే పరిస్ధితి లో కూడా నేను లేను. ఎందుకంటే..........
...... చిన్నప్పుడు నేనెంతో అభిమానించిన బ్రూస్ లీ నాకు కొత్తగా కనిపిస్తున్నాడు. పీలగా, బక్కగా, ఏంటో అస్సలు నా టీనేజి కంటికి ఆనలేదు. మొహంలో ఎటువంటి హావభావాలు లేకుండా, ఊరికే అడ్డు ఆపు లేకుండా, అసలెందుకు తంతున్నాడో ఏంటో అర్ధమయ్యే గ్యాప్ ఇవ్వకుండా, కనిపించే అందర్నీ ఒకటే తన్నడం! భలే నిరుత్సాహం వేసింది. అసలు నా చిన్నప్పటి నా హీరో బ్రూస్ లీ ఈ స్క్రీన్ మీది బ్రూస్ లీ ఒక్కడేనా అని ఓ పెద్ద డౌటానుమానం కూడా వచ్చింది. నేనిలాంటి పరిస్ధితి లో ఊపిరాడకుండా మునుగుతూ తేలుతుంటే.........
బ్యాక్‌గ్రౌండ్ లో మా మావయ్య..... "ఒరే! నువ్వచ్చం బ్రూస్ లీ లానే ఉన్నావురా!"అన్న మాటలు స్టీరియో ఎఫెక్ట్ తో, రీ సౌండ్ తో నా చెవులలో వినిపిస్తున్నాయి. నా కళ్ళకు బ్రూస్ లీ మొహం, చెవులకు బ్రూస్ లీ
అన్న పదం తప్ప ఇంకేం కనపడటం లేదు, వినపడటం లేదు. 'బ్రూస్ లీ' అన్న మాట వినపడటం
ఆలస్యం, నేను నా నిరుత్సాహాన్నంతా నా గొంతులో నింపుకొని, " ఛీ! బ్రూస్ లీ ఇలా ఉన్నాడేంటి?" అన్నాను. మా మావయ్య, ఆ అబ్బాయి ఇద్దరూ యధాశక్తి ఖంగు తిని, వెంటనే సంభాళించుకున్నారు.
కానీ నేను మాత్రం నా నిరుత్సాహాన్ని ఎట్టి పరిస్ధితి లోనూ సంభాళించుకునే స్థితి లో లేను. చుట్టుపక్కల జరుగుతున్న విషయం గ్రహించుకునే స్ధితి లోనూ లేను. కొంచం గ్యాప్ ఇచ్చి, ఆ అబ్బాయిని ఓదార్చడానికన్నట్టు మళ్లీ మా మావయ్య మొదలెట్టాడు, "ఒరే నీవచ్చం బ్రూస్ లీ......" అని. బ్రూస్ లీ పేరు వినపడటం ఆలశ్యం, వెంటనే నేనూ మొదలెట్టాను, "ఛీ బ్రూస్ లీ ఇలా ఉన్నాడేంటి?" అంటూ. మా మావయ్య నాకు చేత్తోటి, కంటి తోటి తెగ సైగలు చేసేస్తున్నాడు. కానీ నా కంటికి బ్రూస్ లీ తప్ప ఇంకేం
కనిపించట్లేదు. నా కర్ధమైందనుకొని పాపం మా మావయ్య మళ్లీ మొదలెట్టాడు. వెంటనే అందుకుని నేనూ
సిన్సియర్ గా 'ఛ' గుణింతం వల్లిస్తూ ఫాలో ఐపోయాను.
మిగిలిన వాళ్ళందరూ నా వైపు, ఆ అబ్బాయి వైపు టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్టు చూస్తున్నారు. పాపం ఆ
అబ్బాయి ఇబ్బందిగా మెలికలు తిరిగిపోతున్నాడు. సైగలు కాదు కదా డైరెక్ట్ గా చెప్పినా నేను అర్ధం చేసుకునే టైపు కాదని గ్రహించుకుని మా మావయ్య ఇంక వదిలేశాడు. నేను మాత్రం ప్రపంచం లోని నిరుత్సాహాన్నంతా నా మొహం లోనూ, గొంతు లోనూ నింపుకొని మధ్య మధ్య లో "ఛీ బ్రూస్ లీ ఏంటి, ఇలా ఉన్నాడు?" అని మంత్రం జపిస్తున్నట్టు అంటూనే ఉన్నాను.
ఇంక ఆ అబ్బాయి చేత కాలేదు పాపం. "పనుందంకుల్. వెళ్ళొస్తా!" అని అక్కడనుండి పారిపోయాడు. ఆ తర్వాత కూర్చోపెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే కానీ మనకర్ధం కాలేదు. కానీ పాపం, అప్పటినుండీ ఆ అబ్బాయి పేరు బ్రూస్ లీ గానే స్ధిరపడిపోయింది. అలాగే అప్పటినుండీ మా ఇంట్లో ఇలాంటి అసందర్భపు డైలాగులకు 'బ్రూస్ లీ డైలాగ్' లనే పేరూ స్ధిరపడిపోయింది. అదండీ! నా బ్రూస్ లీ డైలాగ్ ల వెనకున్న కధ.

12, ఏప్రిల్ 2016, మంగళవారం
మా సైట్ సీయింగ్ ప్రహసనం
మా సైట్ సీయింగ్ ప్రహసనాన్ని అవధరించండి మరి.
లండన్ వెళ్ళిన క్రొత్తలో మాకు కారు లేక పోవడంతో లోకల్ ట్రైన్ లేదా బస్సు లో తిరిగేవాళ్ళం. మొట్టమొదట సారి గా సైట్ సీయింగ్ కు వెళ్ళినపుడు టూరిస్టుల సౌలభ్యం కోసం నడిచే, 'బిగ్ బెన్' కంపెనీ వారి 'హాప్ ఆన్, హాప్ ఆఫ్' బస్సు ఎక్కాం. ఆ టికెట్ కొంటే ఆ రోజంతా ఆ కంపెనీ వారి ఏ బస్ అయినా, ఏ స్టాప్ లో అయినా ఎక్కచ్చు, దిగచ్చు.
అది డబల్ డెకర్ బస్సు. పైన ఓపెన్ టాప్ ఏరియా లో కూర్చుందామని మెట్లు ఎక్కుతుంటే, నీట్ గా ఇన్‌షర్ట్ చేసుకుని, ఎడమ చేతిలో కొన్ని హెడ్‌ఫోన్ సెట్లు పట్టుకొన్న ఓ యువకుడు, కుడిచేతిలో ఓ హెడ్ ఫోన్ సెట్ పట్టుకొని, చిరునవ్వు తో, "వుడ్ యు లైక్ టు హావ్ ఎ హెడ్ ఫోన్ సెట్ సర్?" అని ఎంతో మర్యాదగా మావారిని అడిగాడు. దానికి ఈయన చెయ్యి, తల అడ్డంగా ఊపుతూ, "నో, ధాంక్స్" అని ఆ అబ్బాయికి చెప్పి, వెనక వస్తున్న నా వైపుకు తిరిగి, లోగొంతుక తో "ఇండియా లోలాగానే, ఇక్కడ కూడా బస్సుల్లోనూ, రైళ్ళలోనూ అవీఇవీ అమ్ముకునే వాళ్ళుంటారు. వాటి క్వాలిటీ ఏం బాగోదు. నువ్వు అలాంటివి ఏవీ తొందరపడి తీసుకోవద్దు" అన్నారు.
నేను అలాగే అని బుద్ధిగా తల ఊపి, తల ఇంకోవైపుకు తిప్పేసుకుని, ఆ అబ్బాయి ఏం చెప్పేది వినకుండా, గబగబా మెట్లు ఎక్కేసి తన ప్రక్కనే కూర్చున్నా. దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయున్నాయి. మాది లాస్ట్ సీట్. బస్సు లండన్ రోడ్లలో నెమ్మదిగా వెళుతోంది. కొన్ని బిల్డింగ్ ల దగ్గర కొద్దిసేపు ఆగి మళ్లీ
బయలుదేరుతోంది
కొంచెం సేపయిన తర్వాత మేం గమనించినదేమిటంటే, మా ముందున్న అందరూ, కీ ఇచ్చిన మరబొమ్మల్లా అందరూ ఒక్కసారే కుడివైపుకు, మళ్లీ కొంచెంసేపు ఐన తరువాత ఎడమవైపుకు తిరిగి
చూస్తున్నారు. వెంటనే ఏం అర్ధం కాలేదు. కొన్ని సెకన్ల తరువాత వెలిగింది, వాళ్ళందరూ హెడ్‌ఫోన్లు
పెట్టుకొని ఉన్నారనిన్నీ, దాన్లోంచి ఆ లాండ్‌మార్క్ బిల్డింగ్ ల గురించిన రన్నింగ్ కామెంటరీ వింటున్నారనిన్నీ, మాకు పాపం ఆ అబ్బాయి హెడ్‌ఫోన్ అమ్మచూపలేదనిన్నీ, కేవలం ఇవ్వచూపాడనిన్నీ,
మేము ఏదేదో ఊహించేసుకొని ఆ హెడ్ ఫోన్ తృణీకరించామనిన్నీ వగైరా వగైరా!
అయిందేదో అయింది, మళ్లీ ఆ అబ్బాయినడిగి రెండు హెడ్‌ఫోన్ సెట్లు తెమ్మంటే ఈయనకు అహం అడ్డొచ్చింది. 'ఈ మూకీ సినిమా నేను చూడను, ముందెళ్ళి తెస్తారా లేదా'. అన్నా కదలకుండా కూర్చున్నారు.
ఇలా కాదని నేను కిందకెళితే, నన్ను చూడగానే ఆ అబ్బాయి రెండు హెడ్‌ఫోన్ సెట్లు చేతిలో పెట్టాడు.
నాకు మాత్రమే తెచ్చుకుందామని అనిపించినా పోన్లే పాపం అని రెండూ పట్టుకొచ్చాను. ఇంక మేం కూడా అందరితో పాటు అటూఇటూ తల తిప్పి చూడటం మొదలు పెట్టాం.
అంతలో మేడమ్ టుసాడ్ వాక్స్ మ్యూజియం వాక్స్ మ్యాజియం స్టాప్ వచ్చింది. అది చూడాలనుకొని అక్కడ దిగి, టికెట్ కొనుక్కుని క్యూ లో నించున్నాం. క్యూ నెమ్మదిగా కదులుతోంది. కొద్ది సేపట్లోనే
మైన్ డోర్ దగ్గరకు వచ్చేశాం. లోపలికి ఎంటరవ్వగానే కుడిచేతిప్రక్క ఒక పోలీసాఫీసర్ టికెట్ చెకింగ్ కోసం చెయ్యిచాపి నించున్నాడు. టికెట్స్ చూపిస్తే ఎంతకీ తీసుకోడే! కొన్ని సెకన్ల తర్వాత వెలిగింది, అదికూడా ఓ వాక్స్ బొమ్మే అని. కాకపోతే మాలాగే అందరూ చేయబోవడం కొంతలో కొంత ఓదార్పు. ఆ మ్యూజియం లోప్రపంచంలోని ముఖ్యనాయకులు, మేటి క్రీడాకారులు, హాలీవుడ్ స్టార్లు , బ్రిటిష్ రాయల్ ఫామిలీతో సహా
ఇంకా ఎందరివో లైఫ్ లైక్ బొమ్మలున్నాయి. అక్కడ గుర్తు పట్టగలిగిన వాళ్ళందరి వాక్స్ బొమ్మలతోనూ
ఫోటోలు తీసేసుకున్నాం. అప్పటికి అక్కడ కేవలం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వి తప్ప
మరే ఇతర ఇండియన్స్ బొమ్మలూ లేవు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళ బొమ్మలు అంత బాలేవు.
ఆ తర్వాత ఇక ఆ రోజుకు చాలించి ఇంటికి వెళ్ళిపోయాము.
10, ఏప్రిల్ 2016, ఆదివారం
Excuse me lady! You're beautiful!
నేనేనండీ ఆ beautiful lady ని.
ఆ beautiful lady వెనకున్న కధాకమామీషు ఏంటో తెలుసుకోవాలంటే ఇక చదివేయండి మరి.
1998. అప్పుడు మేం మా వారి ఉద్యోగరీత్యా లండన్ లో ఉండేవాళ్ళం. అదే మా మొదటి పరదేశవాసం. అన్నీ కొత్తే, అన్నీ వింతే. కళ్ళు ఇంతింత చేసుకొని అలా చూస్తుండేదాన్ని.
మావారి అమ్మమ్మగారు అంటుండేవారంట, ఈజన్మలో
వస్త్రదానం చేయకపోతే, వచ్చే జన్మలో విదేశాలలో పుట్టి, వేసుకోవడానికి బట్టలు కరువౌతాయని. ఈ వీసా ప్రాబ్లమ్స్ అవీ లేకుండా ఈ షార్ట్ కట్ రూట్ ఏదో బావుందని వీళ్ళందరూ సంబరపడిపోయేవారనుకోండి!
కానీ ఆ విదేశంలో అందరూ కనీసం చేతి చిటికెనవేలు కూడా కనపడకుండా చేతులకు గ్లౌజులు కూడా వేసుకొని కనపడేవారు. ఆ శాపం ఈ దేశంవారికి వర్తించదేమో, ఎందుకంటే వీరికి ఇదే స్వదేశం కదా, అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ కొన్నిరోజుల తర్వాత అర్ధమైంది అది ఱుతుప్రభావమే కానీ దానప్రభావం కాదని.
ఒక్కదాన్నే ఇంట్లో బోర్ కొడుతుందని అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి కూర్చునేదాన్ని. అక్కడినుంచి
ఇంక అలా సైట్‌సీయింగ్ కు వెళ్ళిపోయేవాళ్ళం.
ఒకరోజు తను 'మధ్యాన్నం కల్లా ఆఫీస్కు వచ్చేసెయ్యి. తొందరగా సైట్‌సీయింగ్‌కు వెళదాం' అనడంతో
మధ్యాన్నం మూడు గంటలకు బయలుదేరాను. మా ఇంటినుండి వాళ్ళ ఆఫీస్ కు రెండు ట్రైన్లు
మారి వెళ్లాలి. నేను ట్రైన్ మారడానికి దిగిన స్టేషన్ ఏమో అండర్‌గ్రౌండ్. ఆఫ్ పీక్ అవర్స్ కావడంతో
స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఎక్కడో ప్లాట్‌ఫారం చివర ఒక ఆజానుబాహుడైన ఒక మనిషి దిగాడు.
అంతే, ఇంక ప్లాట్‌ఫారంఅంతా ఖాళీ. దాంతో వెంటనే గబగబా నడవడం మొదలుపెట్టాను.
నేను ఎక్కవలసిన ఇంకో ట్రైన్ వేరే ప్లాట్‌ఫారంకు వస్తుంది. బ్రిడ్జి క్రాస్ చేసి వెళ్ళాలి. నేను నడుస్తున్నాను. నా వెనకాలే అడుగుల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూడకుండానే నడక కొంచం వేగం పెంచాను. వెంటనే నా వెనకే వస్తున్న ఆ అడుగుల వేగం కూడా పెరిగింది. ఈ సారి నడక
ఇంకా బాగా వేగం పెంచి, కొద్దిగా తల తిప్పి వెనక్కి చూశా. నాతో పాటు ట్రైన్ దిగిన ఆ వ్యక్తి పెద్ద పెద్ద అంగలతో నా వెనకాలే వస్తూ ఏదో అంటున్నాడు.
"Excuse me lady!, Please stop! You're beautiful!"
అంటూ ఇంకా ఏదో అంటున్నాడు.
ఇంకంతే! విపరీతంగా భయపడిపోయాను. కాళ్లూచేతులూ వణికిపోతున్నా, ఎలాగో పరుగెత్తడం మెదలుపెట్టాను. ట్రైన్ సంగతి దేవుడెరుగు! ముందీ స్టేషన్ నుంచి బయటపడి, జనాలుండే చోటికి వెళ్ళాలని నా ఆలోచన. ఓ పదడుగులు కూడా పరుగెత్తి ఉండను, ఆ వ్యక్తి నాలుగంగల్లో నన్ను చేరుకుని, నా ముందు నించోని, ఏంటో చెప్తున్నాడు. ఏం చేయాలో తెలీలేదు. వణికిపోతూ నించున్నాను. నాకళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి.
"Are you ok? Is everything alright?" అనడం వినిపించడంతో, కళ్ళు తుడుచుకొని అతని వైపు సరిగ్గాచూశాను.
అతని చేతిలో నా దుపట్టా!!!
ట్రైన్ దిగి గబగబా నడుస్తున్నప్పుడు ఎక్కడో జారి పడిపోయినట్టుంది. పాపం! అది నాకివ్వడంకోసం
నా వెనకాలే వచ్చాడు. తప్పుగా అర్ధం చేసుకున్నందుకు ఎంతో సిగ్గుగా అనిపించింది. పదేపదే sorry, ఇంకా చాలా thanks చెప్పి, నా దుపట్టా తీసుకొని బయలు దేరాను.
ఇంతకీ పాపం అతనన్నది, "Excuse me lady! Please stop! Your beautiful scarf fell down!", అని. అది నాకు "Excuse me lady! Please stop! You're beautiful," లాగ వినపడటంతో, పూర్తిగా వినే ప్రయత్నం చేయకుండానే నాకు తోచింది అర్ధం చేసుకుని, తప్పుగా ఊహించేసుకొని, భయపడిపోయాను. అతను మాత్రం "That's alright!", అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇప్పటికీ ఎప్పుడన్నా మెట్రో ఎక్కినప్పుడు ఈ సంగతి గుర్తొచ్చి నవ్వొస్తుంది.
ఇదండీ ఆ టైటిల్ వెనకాల కధ.
మా సైట్ సీయింగ్ విశేషాలు మరోసారి రాస్తానే!
7, ఏప్రిల్ 2016, గురువారం
ఉగాది శుభాకాంక్షలతో నా బ్లాగారంగేట్రం
నమస్తే!
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఈ బ్లాగ్ ప్రపంచానికి నేను కొత్తే అయినా, బ్లాగులు నాకు కొత్త కాదు.
ఎన్నో ఏళ్ళుగా బ్లాగులు చదువుతున్నాను.
ఎప్పటినుండో రాయాలని అనిపించినా ఎందుకో కుదరలేదు.
నిజం చెప్పాలంటే, కుదరలేదనడం కంటే ఎప్పుడూ ప్రయత్నించలేదనే చెప్పాలి.
ఇన్నేళ్ళ నా జీవితంలో ఎందరితోనో ఆత్మీయ పరిచయం... మరెన్నో మధుర స్మృతులు...
తలుచుకొంటేనే నవ్వొచ్చే విషయాలు, తలుచుకొని తలుచుకొని నవ్వుకొనే సంగతులు, పాటలు,
పాఠాలు, గుణపాఠాలు, ఆటలు, కొట్లాటలు, ఎన్నో, మరెన్నో....
అవన్నీ కాక పోయినా కొన్నైనా మరిచిపోకుండా అక్షరబధ్ధం చేసుకొని దాచుకోవాలనే ఈ నా చిన్ని ప్రయత్నం.
ఈ బ్లాగ్ కేవలం నా జ్ఞాపకాలను పంచుకోవడానికే తప్ప మరే
ఇతర ఉద్దేశ్యాలు నాకు లేవు.
విజ్ఞానం పంచాలనో లేదా ఎవరినో ఎడ్యుకేట్ చేయాలనో, ఉద్ధరించేయాలనో, నన్ను నేను నిరూపించుకోవాలనో నాకస్సలు లేదు.
వాదాలు, వివాదాలు , ఆశించి వస్తే మాత్రం ఆశాభంగం తప్పదు.
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలన్నారు పెద్దలు.
నొప్పింపక తా నొవ్వక అని కూడా అన్నారు కదండీ!!!
మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలతో
శ్రీ

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)