9, మే 2016, సోమవారం

'అమ్మ' కాని 'అమ్మ' లు

నిన్నటి రోజంతా ఎక్కడ చూసినా, విన్నా, 'Happy Mothers Day!' అంటూ హోరెత్తిపోయింది. కానీ, దాదాపు ప్రతీ రోజూ అమ్మకు ఫోన్‌ చేసి మాటాడే నేను, నిన్న మాత్రం ఫోన్‌ చేయలేదు, మాట్లాడలేదు. ఈ సరికొత్త ప్రత్యేక రోజుల గురించి అంతగా తెలియకపోవడంతో అమ్మకు, ఈ అలవాటు ముందునుంచి లేకపోవడం తో నాకు, అలా శుభాకాంక్షలు చెప్పడం ఎందుకో కొంచెం ఇబ్బంది గా,  ఇంకొంచెం కృతకంగా అనిపిస్తుంది. ఇంత వరకు ఎప్పుడూ అమ్మకు ఈ 'అమ్మరోజు' శుభాకాంక్షలు చెప్పలేదు, ఇక మీద ఎప్పుడూ చెప్పను కూడా.


కానీ నా  పిల్లలు మాత్రం ఇక్కడ పెరగడం వల్ల, ఈ ప్రత్యేక రోజులు వాళ్ళకు బాగానే అలవాటయ్యాయి. అలా నా  'అమ్మ' పాత్రలో మాత్రం ప్రతీ సంవత్సరం, ఈ 'అమ్మ రోజు' శుభాకాంక్షలు, బహుమతులూ
అందుకుంటూనే ఉన్నాను. "నీకు ఇష్టం లేకపోయినా సరే, మా కోసం!" అంటూ పిల్లలు వాళ్ళకు చేతనైంది చేస్తుంటారు.


కానీ నేను ఈ 'అమ్మ రోజు' సందర్భం గా వాళ్ళు నాకు ఏం ఇచ్చారో, దాని గురించి వ్రాయబోవడం లేదు. మా అమ్మ గురించో, లేదా  ఓ 'అమ్మ' గా నా గురించో కూడా కాదు. ప్రతీ మనిషి లోనూ వయో, లింగ,
స్ధితిగతులతో నిమిత్తం లేకుండా అమ్మతనం ఉంటుందని నా నమ్మకం. అటువంటి కొందరు 'అమ్మ' లు కాని 'అమ్మ' ల గురించి ఇప్పుడు....


ముందుగా నా బుజ్జిగాడు......As the saying goes,"When a child is born, a mother is born too."
నాకు మాతృత్వపు అమృతాన్ని రుచి చూపించాడు. వాడి బుజ్జిబుజ్జి చేతులతో, ముద్దు ముద్దు మాటలతో, వయసుకు మించిన పరిణితితో కూడిన చేతలతో, నాకు ఎన్నో నేర్పాడు. అమ్మగా నేను ఎదగడానికి కారణమయ్యాడు.  He raised the bar for me to grow as a mother.


వైద్యపరమైన కొన్ని కారణాల వల్ల డాక్టర్ల సలహా తో మాకు వాడొక్కడే చాలనుకున్నాం. కానీ వాడి
ఒంటరితనాన్ని, తోబుట్టువు కోసం వాడి ఆరాటాన్ని చూసి తట్టుకోలేక పోయేవాళ్ళం. 'తల్లి ప్రాణాలకు
ప్రమాదం' అని డాక్టర్లు ముందే హెచ్చరించినా లెక్కపెట్టలేదు. కానీ ఇంత ప్రమాదం అని అర్ధం కాలేదు. ఇంట్లో తక్కువా, hospital లో ఎక్కువా అన్నట్టు నా నెలలు గడిచాయి. ఎప్పుడు ఏ క్షణం లో
నాకేమవుతుందో, లేదా పుట్టబోయే బిడ్డకేమవుతుందో అన్నట్టు ఎన్నో,  ఎన్నెన్నో జరిగాయి.



అదిగో ఆ సందర్భం లో ముబీన్ నా బుజ్జిగాడికి, 'అమ్మ' కాని 'అమ్మ' అయింది. తన గురించి వ్రాయాలంటే కొన్ని పోస్టులే వ్రాయాలి. ప్రస్తుతానికి క్లుప్తంగా, కానీ, ఈ పోస్టు చివర్లో.


అలా ఎన్నో సవాళ్ళు  పుట్టకుండానే ఎదుర్కొని , అసలు పుట్టడం కోసమే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని మా జీవితాల్లోకి వచ్చింది, నా చిన్నతల్లి.  పుట్టాక కూడా దాదాపు పాపం మూడు నెలలు ఆ చిట్టి ప్రాణం ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో గండాలు దాటుకుని, తన రాకతో మా జీవితాలు సుసంపూర్ణం చేసింది, నా బుల్లితల్లి.


ఆ చిన్నితల్లికి ఇంకో అమ్మయ్యాడు, నా బుజ్జిగాడు.  వాడికీ , వాడి చెల్లి కీ మధ్య దాదాపు ఆరు సంవత్సరాల
దూరం ఉంటుంది, అంతే!   కానీ తన చిట్టిచెల్లిని ఎంత ప్రాణంగా చూసుకున్నాడో! ఇప్పటివరకూ కనీసం
ఒక్కసారి కూడా కొట్టలేదు. గిల్లికజ్జాలు హద్దులు దాటలేదు.  తనకు ఎంత అపురూపమైన వస్తువైనా చెల్లి
అడిగందంటే ఇచ్చేసేవాడు. ఆడించాడు, లాలించాడు, తినిపించాడు,  నిద్ర పుచ్చాడు. తన చెల్లి కి
మాటలు, ఆటలు, పాటలు ఎన్నో నేర్పాడు.


వారి వయసుకు తగ్గట్టు స్కూల్లో స్నేహితులతో సమస్యైనా,  bullying  సమస్యైనా ఓ అమ్మ లాగే,  అవి ఎలా పరిష్కరించుకోవాలో తన చెల్లి కి నేర్పాడు. ఇప్పటికీ స్కూల్‌  నుంచి వచ్చాక, ఆ రోజు స్కూల్‌ లో ఏం జరిగిందీ, లేదా  తనకొచ్చిన సమస్య ను చిన్నితల్లి చెప్పేటప్పుడు, చాలాసార్లు  నాది ప్రేక్షక పాత్రే.  ఆ సమస్యనుండి ఎలా బయటపడాలో నా బుజ్జిగాడు సలహా  ఇస్తూ ,  అమ్మగా  నా  పాత్ర కూడా వాడు పోషించేస్తుంటే.......' అమ్మ' గా  వాడి పెంపకం లో నేను గెలిచాననే ఓ చిన్ని సంతృప్తి.  కించిత్తు గర్వం.



ఇంక నా చిన్ని తల్లి......దాని గురించి ఏం రాయాలో కూడా తెలియడం లేదు. సుకుమారమైన మనసు,  అందమైన  మనస్తత్వం,  ఎవర్నీ నొప్పించని సున్నితత్వం, తప్పొప్పుల విచక్షణ,  చిన్న పిల్లలంటే
విపరీతమైన పిచ్చి,  తనవల్ల ఎటువంటి పొరపాటు జరగకూడదనే ఆరాటం, అతి జాగ్రత్త, అతి శుభ్రత,
పెద్దలంటే గౌరవం. అన్నంటే ప్రాణం. నిజం చెప్పాలంటే అచ్చమైన బాపూబొమ్మ లా ఉంటుంది.
అమ్మ,  నాన్నల పెంపకం తో పాటు  అన్న పెంపకం కూడా తోడై,  ఆడపిల్లంటే 'ఇలా' ఉండాలని నాకనిపిస్తుంది.  ఇండియాలో సంగతి నాకు తెలీదు కానీ, ఈ మధ్య కాలంలో ఇక్కడ, చిన్నపిల్లలు, అందునా ఆడపిల్లలు సిగ్గుపడటం నేను  చూడలేదు. కానీ నా చిన్నితల్లి భలే అందంగా సిగ్గు పడుతుంది. పెద్దయ్యాక డాక్టర్  అవుతుందో ఇంకోటో  చెప్పలేను గానీ,  నా చిన్నతల్లి మాత్రం ఖచ్చితంగా ఓ మంచి 'అమ్మ'వుతుంది.


ఇంక ముబీన్‌ గురించి. తను మా బిల్డింగ్ లోనే ఉండేది. మాది 6వ అంతస్తు. తనది 10వ అంతస్తు.
మొదట్లో కేవలం ముఖపరిచయం. అంతే. వాళ్ళ అమ్మాయి,  మా బుజ్జిగాడు ఒకే స్కూలుకెళ్ళేవారు. ఆ
అమ్మాయి  వీడి కన్నా సంవత్సరం పెద్ద. ముందుగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సయిపోయారు. స్కూల్‌ బస్సు కోసం
ఎదురుచూసే సమయాలలో, నెమ్మదిగా మా ఇద్దరి  స్నేహం చిక్కబడింది.



ఇంక నేను నెలలు నిండే కొద్దీ  డాక్టర్ల చుట్టూ ,  హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతుంటే, మా బుజ్జిగాడు ముబీన్
వాళ్ళ ఇంట్లోనే  ఉండేవాడు. మొదట్లో ఏదో కొన్ని గంటలతో  మొదలై,  నెమ్మదిగా రోజుల తరబడి వాళ్ళ ఇంట్లోనే గడపాల్సి వచ్చేది. భోజనం, నిద్ర, స్నానం, హోమ్ వర్క్‌ ఇంక అన్నీ ముబీన్ చూసుకునేది. ఇలా కొన్ని రోజులు  కాదు, కొన్ని  నెలలు చూసుకుంది. వాళ్ళు మాంసాహారం లేకుండా  ముద్ద తినరు. కానీ, వీడి కోసం టొమాటో పప్పు, బంగాళాదుంపల వేపుడు, బెండకాయ వేపుడు, చారు, సాంబారు నేర్చుకుని 'అమ్మ'  లా చేసి పెట్టింది. ఇప్పటికీ మా పిల్లలిద్దరికీ  'ముబీనాంటీ'  అంటే ఎంతో ప్రేమ. ఇంక తన సంగతి చెప్పక్కరలేదు.



అంతే కాదు, నా చిన్నితల్లి కూడా వాళ్ళ ఇంట్లో సభ్యురాలయి పోయింది.  పుట్టాక కొన్ని నెలలపాటు నా
చిన్నితల్లి, రాత్రంతా మేలుకుని పగలు నిద్ర పోయేది. పిల్లలు స్కూలుకి  వెళ్ళగానే ముబీన్ వచ్చి, "నువ్వు
కాసేపైనా  నిద్రపో. లేచి  పని చేసుకున్నాక  వచ్చి పాపను తీసుకో"మని  చెప్పి  చిన్నతల్లిని తీసుకొని వెళ్ళిపోయేది. నేను పనంతా చేసుకుని వెళ్ళేసరికి ఒక్కోసారి మరీ  ఆలశ్యం అయితే,  తను దానికి స్నానం కూడా  చేయించేసి ఉండేది. వాళ్ళ ఇంట్లో మా  పిల్లల బట్టలు, ఇంకా చిన్నతల్లికి అవసరమైన  సామాగ్రి  లాంటివి  కొన్ని,  పెట్టి ఉంచేదాన్ని. అలా ముబీన్ నా చిన్నితల్లి కి కూడా  'అమ్మ' కాని 'అమ్మ'యిపోయింది.
మేము ఆ దేశం వదిలి వచ్చి ఇప్పటికి ఆరేళ్ళ పైనే  అయింది.  మొన్న డిసెంబరు నెలలో మళ్ళీ ఆ దేశం వెళ్ళి ముబీన్ ను కలవగలిగాం.  ఇప్పటికీ అదే ప్రేమ. అదే అభిమానం.


Mubeen! This is for you on the occasion of Mother's Day!
'Thank you' is too small an expression  that doesn't wholly, completely  and aptly convey our feelings for all that you have done.
Thank you for being there for us.
Thank you from both of them and from me too.




8 కామెంట్‌లు:

  1. అమ్మగా నువ్వు చేసిన మీ పిల్లల పరిచయాలు, ముబీన్ తొ నీ అనుబంధం బావున్నాయి. మొత్తానికి కబుర్లకి తెర తీసినందుకు థాంక్స్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముబీన్‌ కు మా జీవితాలలో, మా మనసులలో ఎప్పటికీ ప్రత్యేక స్ధానం ఉంటుంది.
      నీ కామెంట్లతో నా బద్ధకానికి తెరతీసినందుకు ధ్యాంక్స్‌ లలితా!

      తొలగించండి
  2. అజ్ఞాత09-05-16 7:47 PM

    Happy Mother's Day to you too! My eyes are welled up and voice is choking. Wish I could understand all of what you wrote. Love to my darlings. Miss you all.

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత09-05-16 11:59 PM

    నిజమే mother's day రోజున అమ్మని పలకరించటం కృతకమే. మీరు చెప్పిన ఎందరో అమ్మలు కూడా అంతే సత్యం. మా అమ్మకే కాకుండా మరెందరో ప్రత్యక్ష, పరోక్షమైన అనంతమైన అమ్మలందరికి ఇవే నమస్కృతులు. పైన వారెవరో పేర్కొన్నట్టు మీ శైలి బావుంది. మరిన్ని వ్రాయవలసినదిగా నా కోరిక కూడా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ స్పందనకు నా ధన్యవాదాలు.
      నమ్మలేకున్నా, నమ్మాలనిపించే ఆ మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.

      తొలగించండి
  4. కొత్త బ్లాగర్లయిన లలిత గారు, మీరు బాగా వ్రాస్తున్నారు. బద్దకానికి తెరదించి మరిన్ని కబుర్లతో,మరింతమంది రావాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి