చిన్న శబ్దంతో, చిన్ని చిన్ని బుడగలతో, బుసబుసా పైకి పొంగుతున్న కాఫీ పొడి రంగులోని ద్రవం.
చుట్టూ నలుగురు.
ఊహూ! నాకొద్దు. ఆ వాసనే బాలేదు.....
ఏం ఫర్వాలేదు! ఒకసారి తాగి చూడు......
నాకొద్దు. నేను మంచి నీళ్ళు తాగుతాను.....
కొద్దిగా ట్రై చేయి.
గ్లాసు నోటి దగ్గర పెట్టి, కొంచెం బలవంతంగానే,
ఒక్కసారి రుచి చూడు.నచ్చకపోతే నీ ఇష్టం.
ఉక్కిరి బిక్కిరౌతూ....
గొంతులోంచి ముక్కులోకి వెళ్తోందేమో
అనిపిస్తున్న ఆ ద్రవాన్ని మింగలేక మింగి....
యక్!! నాకస్సలు నచ్చలేదు. నాకిదొద్దు. ఇంకెప్పుడూ నన్ను తాగమనద్దు...
అసలు కొంచెం కూడా నచ్చలేదా?? సరే! అయితే!! నీ ఇష్టం....
అప్పుడెప్పుడో ఓ సారి ట్రై చేసి నచ్చలేదన్నావ్!
మళ్ళీ ఓసారి ట్రై చేస్తావా?
నాకొద్దు. I just can’t stand it.
సరే!!నీ ఇష్టం. నీకు తాగాలనిపించినప్పుడే తాగు.
ఆ తాగుబోతేది?? ఈ చుట్టుపక్కల లేదు కదా!
లేదు! ఆ పక్క రూమ్ లో ఏదో సినిమా చూస్తోంది.
ఐతే గబగబా సీసా ఓపెన్ చెయ్యి. ఆ మహాతల్లి వచ్చేలోగా తాగేద్దాం. ఎన్ని రోజులైంది తాగి??
సీసా చూస్తే చాలు, మన కంటే ముందు ఓ గ్లాసు తీసుకుని వచ్చేస్తుంది.
అదిగో! వచ్చేసింది మహాతల్లి......
అంత గోలలో ఈ సీసా మూత తీసిన చప్పుడు దానికెలా వినిపించింది?
పాము చెవులు.....
ఏం మాట్లాడకుండా ఎక్కడికెళ్తోంది?
ఇంకెక్కడికి? సీసా కంటపడిందిగా! గ్లాసు తెచ్చుకోవడానికి.
ఏం చేస్తోంది??
పక్క గది లో నిద్ర పోతోంది.
హమ్మయ్య! ఇదే మంచి టైం. గబగబా ఆ సీసా ఓపెన్ చెయ్.
నెమ్మదిగా... సౌండు వినిందంటే గ్లాసు పుచ్చుకుని రెడీ ఐపోతుంది.
....................
నిద్ర పోతోందన్నావ్???అంత సౌండ్ లేకుండా ఓపెన్ చేసినా ఎలా కనిపెట్టేసింది??
దీనికి కర్ణపిశాచి ఉందా ఏం?? నిద్రపోతున్నదానికి ఈ సీసా మూత తీసిన చప్పుడు ఎలా వినిపించింది?
ఎలా??? వాసన పట్టేసిందా ??? దీనికి antlers ఉన్నాయేమో!!
హ్మ్!!ఏం మాట్లాడకుండా లోపలకెళ్తోంది....
ఇంకెందుకు?? గ్లాసు తెచ్చుకోవడానికి....
ఇప్పుడు ఈ దృశ్యాలను ఇలా ఊహించుకుని. మళ్ళీ చదువుకోండి!
మొదటి రెండు సీన్లలో మా ఆరేళ్ళ బుజ్జిగాడు,
తర్వాత రెండు సీన్లలో రెండేళ్ళ మా చిన్తల్లి...
అన్ని సీన్లలో కామన్‌గా పెప్సీ సీసా, గ్లాసులు.....
‘బేసి’ అని మా చిన్తల్లి పిలుచుకునే ‘పెప్సి’ కు దానికి అర్ధం అవకూడదని మేము ‘ద్రవం’ అని పిల్చుకున్నా,
కనపడకూడదని గాజు గ్లాసులు మానేసి స్టీలు గ్లాసులలో పోసుకుని తాగినా, ‘ జాగృద్స్వప్నసుషుప్తుల్లో ఏ అవస్థలో, ఎక్కడ ఉన్నా, పెప్సి సీసా తెరిచే శబ్దాన్ని ఇట్టే పట్టేసి, మెరిసే కళ్ళతో, మొహంలో అదో అలౌకికానందంతో, చేతిలో గ్లాసుతో వచ్చి నించునే మా చిన్తల్లి కి ‘తాగుబోతు’ అని పేరు పెట్టుకుని పెప్సీ తాగడం, కొనడం సరేసరి, కనీసం ఆ పేరు ఉచ్ఛరించడం కూడా మానుకుని, షాపింగ్ కు వెళ్ళినపుడు beverages aisle
లోకి వెళ్ళడం కూడా మానేసుకున్నాం.
ఎందుకో ఈ రోజు పొద్దున్నే వీళ్ళిద్దరి చిన్నప్పుటి అలవాట్లు గుర్తుకొచ్చి....